ఒక్కో ఉద్యోగానికి రూ.3 లక్షలు వసూలు

ఒక్కో ఉద్యోగానికి రూ.3 లక్షలు వసూలు
  • స్థాయిని బట్టి ప్రజాప్రతినిధులకు వాటాలు  
  • కొత్త, పాత పాలకవర్గాల తీరు ఫైనల్​ లిస్టు పేరిట కాలయాపన
  • జీతాలివ్వకపోవడం, తీసేస్తుండడంతో బయటపడ్డ బాగోతం
  • సీబీఐ విచారణకు ప్రతిపక్షాల డిమాండ్​ 

వరంగల్‍, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ కార్పొరేషన్​లో అవినీతి తారస్థాయికి చేరింది. రోజూ పని చేసుకుంటే పూట గడిచే వారికి సఫాయి ఉద్యోగాల ఆశ చూపిన ప్రజాప్రతినిధులు, లీడర్లు, అధికారులు లక్షల్లో దండుకున్నారు. ఒక్కో ఔట్‍సోర్సింగ్‍ ఉద్యోగానికి రూ. 2 నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేశారు. అవసరానికి మించి తీసుకొని జీతాలు ఇవ్వకుండా, రెండేండ్లుగా లిస్ట్ లో అదిగో పేరొస్తుంది..ఇదిగో పేరొస్తుంది అంటూ మాయమాటలు చెబుతూ వచ్చారు. 452 మందిలో ఇప్పటికే 52 మందిని తప్పించారు. మిగతా వారి పరిస్థితి కూడా అప్పుడో ఇప్పుడో అన్నట్టు ఉంది. దీంతో లంచం ఇచ్చి  నెలల తరబడి మోరీలు తీసే పనిచేసిన వారు ఆవేదన చెందుతున్నారు. అప్పు చేసి లంచం ఇచ్చామని, ఉద్యోగం ఇవ్వాలని లేకపోతే ఇచ్చిన పైసలన్నా తిరిగి ఇయ్యాలని కాళ్లా వేళ్లా పడుతున్నారు. 

రూ.2 లక్షలకో పోస్ట్​ 

గ్రేటర్‍ వరంగల్​లో దోమల నివారణ కోసం ప్రత్యేక టీం పనిచేస్తోంది. దాదాపు 90 మంది కార్మికులు ఏడేండ్లుగా దినసరి ఉద్యోగులుగా చేస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‍లో భాగంగా కార్మికుల సంఖ్య పెంచాలనే సూచన మేరకు 2020లో అప్పటి మేయర్‍ గుండా ప్రకాశ్‍ పాలకవర్గం కౌన్సిల్‍ మీటింగ్‍లో తీర్మానం చేసింది. దీని ఆధారంగా 246 మందిని తీసుకోవాలని నిర్ణయించి సర్య్కులర్​ విడుదల చేశారు.  246 మంది ఔట్‍సోర్సింగ్‍ ఎంప్లాయీస్​ రిక్రూట్​మెంట్​ఓ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఉంటుందని ప్రకటించారు. కానీ, 2021 ఫిబ్రవరిలో పాలకవర్గం ముగుస్తుండడంతో మేయర్‍, ఎమ్మెల్యేలు, డిప్యూటీ మేయర్‍, కార్పొరేటర్లు, లీడర్లు, అధికారులు ఇలా ఒక్కొక్కరు పోస్టులను పంచుకున్నారన్న ఆరోపణలున్నాయి. 58 డివిజన్లకు గాను ఒక్కో కార్పొరేటర్‍కు 3 పోస్టులను భర్తీ చేసుకునే అవకాశం కల్పించారు. మిగతావన్నీ పెద్ద లీడర్ల చేతిలో పెట్టారు. దీంతో సదరు లీడర్లు ఒక్కో పోస్టుకు రూ.2 లక్షలు తీసుకున్నారు. కాంట్రాక్టర్‍, అధికారులను ముందుపెట్టి తమకు అనుకూలంగా ఉండేవారి పేర్లను సెలెక్ట్​ చేయాలని ఏజెన్సీకి పంపారు. అంతకుముందు నుంచి పని చేస్తున్న వారిని డబ్బులు ఇవ్వలేదనే కారణంతో పక్కకు పెట్టడంతో దందా బయటకు వచ్చింది. లీడర్ల బాగోతం బట్టబయలు కావడం, పాలకవర్గం పదవీకాలం ముగియడంతో సెలక్షన్‍ ప్రాసెస్‍ ఆగిపోయింది.  

కొత్త పాలకవర్గం రాకతో...

గ్రేటర్‍ ఎన్నికల తర్వాత మళ్లీ అధికార పార్టీనే బల్దియా పీఠం దక్కించుకుంది. 2021 మే నెలలో గుండు సుధారాణి మేయర్‍గా 66 మందితో కూడిన కొత్త పాలకవర్గం ఏర్పడింది. పెండింగ్​లో ఉన్న ఔట్‍సోర్సింగ్‍ ఎంప్లాయీస్​ సెలెక్షన్‍ లిస్ట్​వీరి వద్దకు వచ్చింది. లిస్టులో ఉన్నవారు అప్పటికే లంచాలు ఇచ్చి ఉద్యోగాలు చేస్తుండడంతో కొత్త పాలకవర్గం మరో ఆలోచన చేసింది. కేటీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా ఉన్న జనాభాకు సిబ్బంది సరిపోవడం లేదని, మరికొంతమంది అవసరం ఉందని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి మౌఖికంగా ఓకే చెప్పడంతో కొత్త , పాత సిబ్బంది కలిపి 450 మంది కావాలని, దానికి గ్రీన్‍సిగ్నల్‍ వచ్చిందని ప్రచారం చేసుకున్నారు. శానిటేషన్, మలేరియా విభాగాల్లో పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. చదువుకున్నవారికి ఆఫీస్​లో, కంప్యూటర్ ఆపరేటర్ లాంటి ఉద్యోగాలు ఇస్తామని, చదువు లేని వారు వారి అర్హతకు తగ్గ పని ఉంటుందని ప్రకటించారు.  రూ.15 వేల జీతం, పీఎఫ్ ​కటింగ్​ ఉంటుందన్నారు.  

డిమాండ్​ పెరిగింది..లంచమూ పెరిగింది..

ఔట్​సోర్సింగ్​ఉద్యోగాలకు డిమాండ్​ పెరగడంతో గతంలో రూ.2 లక్షలు ఉన్న రేటును రూ.3 లక్షలు చేసేశారు. 452 మంది కావాలని, లిస్టు తయారు చేసి అంతకంటే ఎక్కువ మందికి రిక్రూట్​చేసే సంస్థ పేరుతో ఉత్తుత్తి అపాయింట్​మెంట్​ కాపీలిచ్చారు. నెలల తరబడి వారితో మోరీలు తీయించి, రోడ్లు ఊడ్చే పనులు చేయించారు. తీరా జీతాలిచ్చే టైం వచ్చేసరికి అందరికీ ఇవ్వలేక కొంతమందికి ఆపేశారు. 'ఫైనల్‍ జాబితాలో మీ పేరు లేకున్నా..పెట్టించేందుకు రిస్క్​ చేస్తున్నాం' అంటూ రోజులు గడిపారు. ఎమ్మెల్యేలు, మేయర్, లీడర్ల సిఫార్సుల మేరకు రెండేండ్లుగా ప్రతినెలా ఉద్యోగుల సంఖ్య..జాబితాలో పేర్లు మారుస్తూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇదే ఫైనల్‍ లిస్ట్​ అంటూ మాయమాటలు చెబుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో కారణం చెబుతూ ఇప్పటివరకు సుమారు 52 మందిని పక్కనపెట్టారు. ఉద్యోగాల గురించి కాంట్రాక్టర్ కు ఒక సంఖ్య చెప్పడం, ఎమ్మెల్యేలు, మంత్రులు, మేయర్లు, కార్పొరేటర్లు  ఎవరికి నచ్చిన పేర్లను వారు పంపుతుండడంతో కాంట్రాక్టర్ తనతో కాదని చేతులెత్తేశాడు. ఎన్ని పేర్లు పెట్టేదని, ఎంతమందికి జీతాలిచ్చేదని తప్పుకున్నాడు. పనిచేస్తున్నా జీతాలు రానివారు అధికారులను నిలదీస్తే.. కాంట్రాక్టర్‍దే బాధ్యతంటూ మేయర్‍, కమిషనర్‍, అధికారులు సమాధానమిస్తున్నారు. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామని, కోర్టుకు వెళ్తామంటూ రోజులు గడుపుతున్నారు.

ఎమ్మెల్యేలు, మేయర్ల సిఫార్సు..ఆడియోల లీక్‍

సఫాయి పోస్టు కోసం కోసం లక్షలు లంచం ఇచ్చి నెలల తరబడి కష్టపడ్డవారి పేర్లు చివర్లో తీసేస్తుండటంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. తాము ఎవరి తరపున ఉద్యోగాల్లో చేరామో.. డబ్బులు ఎవరికి ఇచ్చామో చెబుతున్నారు. ఉత్తమ ఉద్యోగి ప్రశంశాపత్రాలు అందుకున్నా..ఉద్యోగుల జాబితాలో పేరు లేదంటూ పక్కకు పెట్టడంపై మండిపడుతున్నారు. ఇప్పటి ఎమ్మెల్యేలు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల వాటాలు, పైరవీలకు సంబంధించి..కొందరు లీడర్లు, కాంట్రాక్టర్‍ ఆదినారాయణ, అప్పటి ఎంహెచ్‍ఓ రాజారెడ్డి మాట్లాడుకున్న ఆడియోలు బయటపెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్‍, కార్పొరేటర్లు, కమిషనర్‍ ఆఫీస్‍, కొందరు జర్నలిస్టులు ఎన్నెన్ని ఉద్యోగాల కోసం సిఫార్సు చేశారో చెప్పే లెటర్లు కూడా సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పోస్టుల భర్తీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలంటూ విపక్షాలు డిమాండ్‍ చేస్తున్నాయి.  

3 లక్షలు ఇచ్చినం.. 15 నెలలు పనిచేసినం

నా భర్త మధుకర్‍కు ఔట్‍సోర్సింగ్‍ పోస్టు కోసం రెండేండ్ల కింద రూ.3 లక్షలు ఇచ్చినం. ఆరునెలల తర్వాత ఆయనకు హార్ట్​స్ట్రోక్​ వచ్చింది. పనిచేయలేడు కాబట్టి నా పేరు ఎక్కించడానికి చాలా రోజులు బతిలాడిన. చివరికి ఎంహెచ్‍ఓ అడిగిన రూ.20 వేలు కూడా ఇచ్చిన. 15 నెలలు పనిచేస్తే 10 నెలలు జీతం వేసిన్రు. ఫైనల్‍ లిస్టులో మా పేరు ఉందని కూడా చెప్పారు. ఇప్పుడేమో లేదంటున్నరు. జాబ్‍ వస్తుందని రూ.3 లక్షలు అప్పు తీసుకొచ్చిన. వాళ్లకు నెలకు రూ.6 వేల వడ్డీ కడుతున్నం. మా బాధ ఎవ్వరికి చెప్పుకున్నా పట్టించుకోవట్లేదు.  

- పసునూరి రజిత, బొల్లికుంట

జాగా అమ్మి రూ.3.50 లక్షలిచ్చిన 

మున్సిపాలిటీలో ఉద్యోగాలు పడ్డయ్‍. పైసలు కడితే ఇస్తున్నారంటే జాగా అమ్మి మీడియేటర్‍ ప్రవీణ్‍ ద్వారా రూ.3.50 లక్షలు కట్టిన. 10 నెలలు రోడ్లు ఊడ్చిన. ఇప్పుడేమో నా పేరు లేదంటున్నరు. ఇదే విషయాన్ని మేయర్‍ సుధారాణి మేడంకు చెబితే.. కాంట్రాక్టర్‍దే బాధ్యత మాకు తెల్వదు అంటున్నరు. న్యాయం చేయకుంటే నా కుటుంబం రోడ్డున పడ్తది. 

- అరుణ, బొల్లికుంట

అన్యాయాన్ని చెప్పుకుంటే..అరెస్ట్​చేస్తరట 

డిగ్రీ చదివిన. మున్సిపాలిటీలో ఉద్యోగం అనగానే..ఫ్యూచర్‍ ఉంటదని అప్పటి మేయర్‍ గుండా ప్రకాశ్‍కు రూ.3 లక్షలిచ్చిన. 10 నెలలు మోరీలు సాఫ్ చేసిన. ఏ పని చెబితే అది చేసిన. ఇప్పుడేమో నా పేరు లేదన్నరు. మాకు జరిగిన అన్యాయాన్ని గ్రీవెన్స్​లో కమిషనర్‍ ప్రావీణ్య దృష్టికి తీసుకువెళ్తే గట్టిగా మాట్లాడుతున్నడు అరెస్ట్​ చేయాలని సీఐకి చెప్పింది. ఇలా అయితే మాకు న్యాయం చేసెటోళ్లెవలు?. 

- అవినాశ్‍, బాధిత యువకుడు