ఈడీ అదుపులో సాహితీ లక్ష్మీనారాయణ

ఈడీ అదుపులో  సాహితీ లక్ష్మీనారాయణ

హైదరాబాద్, వెలుగు: సాహితీ ఇన్ ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అదుపులోకి తీసుకుంది. ఆదివారం మధ్యాహ్నం విచారణకు పిలిచి రాత్రి వరకు ప్రశ్నించింది. సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లా అమీన్‌‌పూర్‌‌లో సాహితీ రియల్ ఎస్టేట్ ప్రీ-లాంచింగ్ పేరుతో ఆయన మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. 

ప్రాజెక్టు పూర్తి చేయకుండానే రూ.260 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు హైదరాబాద్ సీసీఎస్​లో కేసు నమోదైంది. రూ.126 కోట్లు దారి మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో సీసీఎస్ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో రూ. 161 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. దర్యాప్తులో భాగంగా లక్ష్మీనారాయణను శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులు విచారించింది. ఈడీ అధికారులకు సరైన ఆధారాలు ఇవ్వకపోవడంతో పాటు విచారణకు సహకరించక పోవడంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.