సలార్​ ‘ఏ’ సర్టిఫికెట్​ మూవీ.. పిల్లలకు నో ఎంట్రీ ... అనుమతించని మల్టీప్లెక్సులు

సలార్​ ‘ఏ’ సర్టిఫికెట్​ మూవీ.. పిల్లలకు నో ఎంట్రీ ... అనుమతించని మల్టీప్లెక్సులు

హైదరాబాద్, వెలుగు: ప్రభాస్‌‌ హీరోగా నటించిన సలార్ మూవీ చూద్దామని వెళ్లే ఫ్యామిలీలకు నిరాశ ఎదురవుతున్నది. పిల్లలతో మల్టీప్లెక్సులకు వెళ్తున్న వారిని సిబ్బంది అనుమతించట్లేదు. సలార్​ ‘ఏ’ సర్టిఫికెట్ మూవీ అని, 18 ఏండ్లకు లోబడిన వారిని అనుమతించేది లేదని నిర్వాహకులు చెబుతుండటంతో ఫ్యామిలీతో వచ్చిన ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులతో వాగ్వాదానికి దిగుతున్నారు. గతంలో చాలా ‘ఏ’సర్టిఫికెట్​ సినిమాలకు పిల్లలతో వెళ్లామని, ఈ సినిమాకే ఎందుకు అనుమతించడం లేదని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.

 చాలా థియేటర్లలో మైనర్లను అనుమతిస్తున్నారని, మల్టీప్లెక్సుల్లోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. రాష్ట్రంలో రెండ్రోజుల నుంచి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సోమవారం ఉప్పల్ డీఎస్‌‌ఎల్ మాల్‌‌లో పిల్లలతో సినిమా చూడడానికి వచ్చిన ఓ మహిళ, కాచిగూడలోని ఓ థియేటర్‌‌‌‌ నిర్వాహకులతో వారు వాగ్వాదానికి దిగారు. కాగా, కొన్ని థియేటర్లు అమౌంట్‌‌ను రీఫండ్ చేస్తుండగా, మరికొన్ని చేయట్లేదు. దీంతో ఒక్క టికెట్‌‌ను రూ.400లకు పైగా పెట్టి కొనుగోలు చేసిన ఫ్యామిలీ ప్రేక్షకులు నష్టపోతున్నారు.