
లండన్: జింబాబ్వేతో జరగనున్న ఏకైక టెస్ట్‌కు ఇంగ్లండ్ జట్టును శుక్రవారం ప్రకటించారు. అన్ క్యాప్‌డ్ ప్లేయర్లు సామ్ కుక్, జోర్డాన్ కాక్స్‌కు 13 మంది జట్టులో చోటు దక్కింది. ఈ నెల 22 నుంచి ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. 2003 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై జింబాబ్వే ఆడనున్న తొలి టెస్ట్ ఇది. ఇండియాతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు సన్నాహకంగా ఈ మ్యాచ్‌ను ఇంగ్లిష్ జట్టు ఉపయోగించుకోనుంది. ఇటీవల కౌంటీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న 27 ఏళ్ల మీడియం పేసర్ కుక్ 19.77 యావరేజ్‌తో 318 ఫస్ట్ క్లాస్ వికెట్లు తీశాడు.
ఆసీస్‌లో పర్యటించిన ఇంగ్లండ్ లయన్స్ తరఫున ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. ఇక వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కాక్స్.. గతేడాదే న్యూజిలాండ్‌పై డెబ్యూ చేయాల్సి ఉంది. కానీ బొటన వేలి ఫ్రాక్చర్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. 2003 యాషెస్‌లో ఆడిన నాటింగ్‌హామ్‌షైర్ సీమర్ జోష్ టంగ్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో టంగ్ 24 యావరేజ్‌తో 24 వికెట్లు తీశాడు.
ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జెమీ స్మిత్, జోష్ టంగ్.