
అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో నటిస్తున్న మాస్ సినిమా అంటే ఓ స్పెషల్ సాంగ్ కంపల్సరీ. ఆ పాటలో సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఆడిపాడితే.. ఇక వచ్చే క్రేజే వేరు. ‘పుష్ప’ సినిమా విషయంలో అలాంటి ఓ క్రేజీ సాంగ్‌ని నిన్న రిలీజ్ చేశారు. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ సాగే ఈ మాస్ సాంగ్‌ని దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు. ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్‌తో ఆకట్టు కునేలా పాడింది. ‘బొద్దు బొద్దుగుంటే ఒకడు ముద్దుగున్నావ్ అంటాడు.. సన్న సన్నంగుంటే ఒకడు.. సరదా పడిపోతుంటాడు.. బొద్దు కాదు సన్న కాదు.. ఒంపుసొంపు కాదండీ.. ఒంటిగ చిక్కామంటే చాలు.. మీ మగబుద్ధే వంకరబుద్ధి’ అంటూ కొంత సెటైరికల్‌గా లిరిక్స్ రాశారు చంద్రబోస్.
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య డ్యాన్స్ కంపోజ్ చేశారు. మరోవైపు ఈనెల 17న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్, సీఈవో చెర్రి మీడియాతో ముచ్చటించారు. ‘ఇలా ఒకే సినిమాలోని అన్ని పాటలూ సూపర్ హిట్ కావడం హ్యాపీగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మూడు వేలకు పైగా థియేటర్స్‌లో ఐదు భాషల్లో ‘పుష్ప’ని విడుదల చేస్తున్నాం. 2 గంటల 15 నిమిషాలు సినిమా డ్యూరేషన్. అన్ని భాషల్లోనూ చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లోనే సినిమా ఉంటుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది బ్యాక్‌డ్రాప్ మాత్రమే, అదే అసలు కథ కాదు. అల్లు అర్జున్‌ని ఎప్పుడూ చూడనంత కొత్తగా చూడబోతున్నారు. అభిమానులకు ట్రీట్‌లా ఉంటుంది’ అని చెప్పారు.