V6 News

Movie Review: ఓటీటీలో ఉత్కంఠరేపే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్.. కాకి ఆలయం వెనుక సస్పెన్స్ మిస్టరీ..

Movie Review: ఓటీటీలో ఉత్కంఠరేపే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్.. కాకి ఆలయం వెనుక సస్పెన్స్ మిస్టరీ..

ప్రస్తుతం క్రైమ్‌, మిస్టరీ థ్రిల్లర్‌ జానర్ సినిమాలకు ఓటీటీల్లో డిమాండ్ పెరిగింది. లవ్, యాక్షన్, రొమాన్స్ వంటి జానర్ సినిమాలను ఆడియన్స్ ఎంతోకాలంగా చూస్తూనే వస్తున్నారు. ఒకవేళ అలాంటి జానర్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వాటిపై లుక్కేయడం మానేశారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు కేవలం మిస్టికల్ ఎలిమెంట్స్ ఉంటే చాలు.. ఆసక్తి పెంచేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్‌ & మిస్టరీ థ్రిల్లర్‌ సినిమా ఓటీటీకి వచ్చింది. అదే సంభవం అధ్యాయం ఒన్ను (Sambhavam Adhyayam Onnu).

ఇదొక మలయాళ తెలుగు డబ్బింగ్ మూవీ. గ‌త నెల (March) మల‌యాళంలో థియేట‌ర్ల‌లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ఓటీటీకి వచ్చేసింది. ఇవాళ ఏప్రిల్ 15 నుంచి జియో హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో అస్కర్ అలీ ప్రధాన పాత్రలో నటించగా,వినీత్ కుమార్, సిద్ధార్థ్ భరతన్, అసిమ్ జమాల్, శ్రీకాంత్ దాసన్, సెంథిల్ కృష్ణ, నీతూ కృష్ణ మరియు గౌరీ వినీత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

కథ:

కర్ణాటక–కేరళ సరిహద్దుల్లో ఒక అడవి ప్రాంతం. అక్కడ వింత రహస్యాలతో నిండిన ప్రదేశాలు. ముఖ్యంగా ఆ దట్టమైన అటవీ ప్రాంతంలో కాకి ఆకారంలో ఉండే ఓ రహస్య ఆలయం. దాని చుట్టూ దాగున్న అనేక మిస్టరీస్. అక్కడికి వెళ్తే ఎవరూ తిరిగి రారని ఊళ్ళో జనాల నమ్మకం. అంతేకాదు.. తరుచూ అడవిలో మిస్సింగ్ కేసులు నమోదు.

ఈ క్రమంలోనే ఓ రోజు త‌మిళ‌నాడు పోలీస్ ఆఫీస‌ర్ ఆ అడ‌విలోకి వెళ్లి క‌నిపించ‌కుండా పోతాడు. ఈ విష‌యం తెలుసుకున్న కేర‌ళ పోలీసులు అత‌న్ని వెతుక్కుంటూ ఫారెస్టులోకి వెళ‌తారు. అక్క‌డ వారికి త‌మిళ పోలీసు ఆచూకీ ల‌భించ‌క పోగా వింత వింత ప‌రిస్థితులు ఎదురువుతాయి. అలాగే, ఓ అమ్మాయి శవం కూడా కనిపిస్తుంది.

ఇదే సమయంలో మరో పోలీస్ ఆఫీసర్ స్టీఫెన్ తనను కాపాడాలని వాకీటాకీలో సహాయం కోరుతాడు. దీంతో మరో ఇద్దరు పోలీసు ఆఫీసర్స్ అడవిపై పూర్తి అవగాహన ఉన్న రెజీతో కలిసి లోపలికి వెళ్తారు. అక్కడ మనిషి శరీరం, కాకి తలతో ఉన్న వింత ఆలయం కనిపిస్తుంది.

ఆ తర్వాత వాళ్లకు అనూహ్యమైన, భయానక అనుభవాలు ఎదురవుతాయి. అసలు ఆ అమ్మాయి శవం ఎవరిది? మిస్ అయిన త‌మిళ‌నాడు పోలీసుని కాపాడగలిగారా? ఆ వింత ఆలయం వెనుక ఉన్న రహస్యం ఏమిటి?  ఇంతకీ టైం లూప్ మిస్టరీ ఏంటన్నదే ఈ థ్రిల్లింగ్ కథ. 

విశ్లేషణ:

కొత్త దర్శకుడు జీతూ సతీషన్‌ తెరకెక్కించిన ఈ మూవీకి థియేటర్లో మంచి మార్కులే పడ్డాయి. మిస్సింగ్ కేసులు, టైమ్ లూప్ కాన్సెప్ట్, అడ‌విలో కాకి ఆకారంలో ఉండే ఓ రహస్య ఆలయం కథాంశాలను తీసుకుని సక్సెస్ అయ్యాడు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుడ్ని పక్కకు కదపకుండా మిస్ట‌రీ, స‌స్పెన్స్‌తో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టాడు. సౌండ్ డిజైన్ సినిమా భయానకతను మరింత పెంచింది.

►ALSO READ | యువతకు హెచ్చరికలా.. పిఠాపురంలో.. అలా మొదలైంది

ఎప్పుడైతే కాకి ఆలయం వెనుక మిస్టరీ తెలుస్తుందో.. అప్పుడు కథలో మరింత ఉత్కంఠ మొదలవుతుంది. దానికితోడు స్టార్టింగ్లో చూపించిన ఒక అమ్మాయి, అబ్బాయి హత్యల వెనక కారణం చెప్పకుండా దాచిన నిజం.. కాకి ముఖం ఉన్న విగ్రహానికి సంబంధం ఉందని తెలిసే సీన్ గూస్ బంప్స్ ఇస్తుంది. చివరి 40 నిమిషాలు రివీల్‌ అయ్యే షాకింగ్ ట్విస్ట్స్ అయితే సినిమాను తారాస్థాయిలో నిలబెట్టాయి.

వాస్తవానికి, ఈ చిత్రం దర్శకుడు జీతూ గతంలో తీసిన సంభవం అనే షార్ట్ ఫిల్మ్కి కొనసాగింపు. చిన్న కథాంశాన్ని పూర్తి నిడివి చిత్రంగా విస్తరించడం కష్టం అయినప్పటికీ, అతని ప్రయత్నం మెచ్చుకోదగ్గది. కథాంశం పూర్తిగా కొత్తది కాకపోయినా, మలయాళ సినిమాలో ఇది అరుదైన ప్రయోగం కావడం వల్ల ప్రత్యేకతను సంపాదించింది.

సినిమాటోగ్రఫీ అడవి వాతావరణాన్ని అద్భుతంగా చూపించింది. సౌండ్ డిజైన్ సినిమా భయానకతను మరింత పెంచింది.మొత్తంగా, సంభవం అధ్యాయం ఒన్ను మిస్టరీ, సస్పెన్స్, టైమ్ లూప్ అంశాలను కలిపిన ఆసక్తికరమైన థ్రిల్లర్‌గా నిలుస్తుంది. కొత్త కాన్సెప్ట్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది తప్పక చూడదగ్గ చిత్రం.