బీహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. ఏప్రిల్ 15న గవర్నర్ సయ్యద్ అత హస్నైన్, చౌదరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్ర నాయకులు, మిత్రపక్షాలు హాజరయ్యారు.
సామ్రాట్ చౌదరి బ్యాగ్రౌండ్
మాస్ లీడర్‌గా పేరుగాంచిన సామ్రాట్ చౌదరి బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో 1968 నవంబర్‌లో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి శకుని, తల్లి పార్వతి ఇద్దరూ ఎమ్మెల్యేలుగా పని చేశారు. తారాపూర్ నియోజకవర్గం సామ్రాట్ చౌదరి ఫ్యామిలీకి కంచుకోట. ఇక్కడి నుంచి ఆయన తండ్రి శుకుని ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, అతడి తల్లి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో తమ కుటుంబానికి కంచుకోటైన తారాపూర్ నుంచే సామ్రాట్ చౌదరి కూడా పోటీ చేసి ఘన విజయం సాధించారు.
సామ్రాట్ చౌదరి రాజకీయ జీవితం
1999లో సామ్రాట్ చౌదరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)తో తన పొలిటికల్ కెరీర్‌ను స్టార్ట్ చేశారు. 2000 సంవత్సరంలో ఖగారియాలోని పర్బట్టా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రబ్రీ దేవి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆర్జీడీ హైకమాండ్‌తో విభేదాలు రావడం, ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో 2014లో ఆర్జేడీకి రాజీనామా చేసి నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూలో చేరారు. జితన్ రామ్ మాంఝీ కేబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు.
చేరిన మూడేళ్లకే జేడీయూకు గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత 2017లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఇక్కడి నుంచి ఆయన పొలిటికల్ కెరీర్ మరో స్థాయికి వెళ్లింది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఆపై 2023లో బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా అంచెలంచలుగా ఎదిగారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో సీఎం నితీష్ కుమార్ డిప్యూటీగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టారు. రాజ్యసభకు ఎన్నిక కావడంతో నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు.
#WATCH | Patna, Bihar: Samrat Choudhary takes oath as the Chief Minister of Bihar
— ANI (@ANI) April 15, 2026
He becomes the first Bharatiya Janata Party (BJP) Chief Minister of Bihar following the resignation of Nitish Kumar. pic.twitter.com/ObDBH2RxJr

