శాన్‌‌‌‌ఫ్రాన్సిస్కోలో డ్రైవర్​లెస్‌‌‌‌ బస్సులు

శాన్‌‌‌‌ఫ్రాన్సిస్కోలో డ్రైవర్​లెస్‌‌‌‌ బస్సులు
  • అంతకుముందు రోబో ట్యాక్సీలు తీసుకొచ్చిన ట్రాన్స్‌‌‌‌పోర్ట్  డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌

శాన్‌‌‌‌ఫ్రాన్సిస్కో: డ్రైవర్​రహిత బస్సు సర్వీసులను శాన్‌‌‌‌ఫ్రాన్సిస్కో లాంచ్‌‌‌‌ చేసింది. ట్రెజర్‌‌‌‌‌‌‌‌ ఐల్యాండ్‌‌‌‌లో ఒక ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌ రూట్‌‌‌‌లో లూప్‌‌‌‌ మార్గం ద్వారా డ్రైవర్‌‌‌‌‌‌‌‌ లెస్‌‌‌‌ షటిల్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ బస్సులను నడపనున్నారు. డైలీ ఉచితంగా ఈ బస్సుల్లో ఐల్యాండ్‌‌‌‌ చుట్టూ జర్నీ చేయొచ్చు. శాన్‌‌‌‌ఫ్రాన్సిస్కో బే మధ్యలో ఉన్న అమెరికా నేవీ స్థావరం అయిన ట్రెజర్‌‌‌‌‌‌‌‌ ఐల్యాండ్‌‌‌‌లో ఈ సర్వీస్‌‌‌‌లను ప్రారంభించారు. డ్రైవర్ సీటు, స్టీరింగ్‌‌‌‌ వీల్‌‌‌‌ ఇందులో ఉండదు. అవసరమైతే హ్యాండ్‌‌‌‌ హెల్డ్‌‌‌‌ కంట్రోలర్‌‌‌‌‌‌‌‌తో బస్సును నడిపే సిబ్బంది ఇందులో ఉంటారు. పైలట్‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌లో భాగంగా ఈ షటిల్‌‌‌‌ సేవలను అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు. 

డ్రైవర్‌‌‌‌‌‌‌‌ లెస్‌‌‌‌ బస్సులో సిబ్బంది ఒకరు ఉండటం వల్ల నిర్భయంగా జర్నీ చేయొచ్చని శాన్‌‌‌‌ఫ్రాన్సిస్కో కౌంటి ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్‌‌‌‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ టిల్లీ చాంగ్‌‌‌‌ సూచించారు. పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్‌‌‌‌ను మార్చేందుకు సెల్ఫ్‌‌‌‌ డ్రైవింగ్‌‌‌‌ వాహనాల భద్రత, సామర్థ్యాన్ని పరీక్షిస్తున్న నగరాల్లో శాన్‌‌‌‌ఫ్రాన్సిస్కో ఒకటి. ఓర్లాండో , ఫ్లోరిడాకు చెందిన బీప్‌‌‌‌ అనే సంస్థ ఈ షటిల్స్‌‌‌‌ను నిర్వహిస్తోంది. బస్సుల వ్యవస్థను రిప్లేస్‌‌‌‌ చేసేందుకు తాము షటిల్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లను తేలేదని, చిన్న చిన్న కనెక్టివిటీ మార్గాల కోసం వీటిని డెవలప్ చేశామని బీప్‌‌‌‌ ప్రాజెక్ట్ మేనేజర్ షెల్లీ తెలిపారు. బుధవారం టెస్ట్ రైడ్‌‌‌‌ సమయంలో ఈ డ్రైవర్‌‌‌‌‌‌‌‌ లెస్‌‌‌‌ బస్సు స్లోగా, జాగ్రత్తగా నడిచిందని కంపెనీ తెలిపింది. ఇందులో మొత్తం 10 మంది ప్రయాణించొచ్చని పేర్కొంది. 

డ్రైవర్‌‌‌‌‌‌‌‌ లెస్‌‌‌‌ వెహికల్స్ వల్ల సమస్యలు కూడా వస్తున్నాయని, స్టాప్ ఉన్న చోట కాకుండా ఎక్కడపడితే అక్కడ ఆగుతున్నాయని, దీంతో ట్రాఫిక్‌‌‌‌ జామ్‌‌‌‌ ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. కాగా, అంతకు ముందు రోబో ట్యాక్సీ సర్వీసులను కూడా శాన్‌‌‌‌ఫ్రాన్సిస్కో ప్రారంభించింది. దీని విస్తరణకు అధికారులు అమోదించిన వారంలోపే డ్రైవర్‌‌‌‌‌‌‌‌ లేని బస్సులు రోడ్లపై పరిగెత్తేందుకు పర్మిషన్‌‌‌‌ ఇచ్చింది. ట్రాఫిక్‌‌‌‌, భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ కాలిఫోర్నియా రెగ్యులేటర్లు రోబో ట్యాక్సీల విస్తరణకు ఆమోదం తెలిపారు. అయితే, ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని రోబో ట్యాక్సీ విస్తరణను నిలిపివేయాలని సిటీ కమిషన్‌‌‌‌కు విజ్ఞప్తులు వస్తున్నాయి.