ర్యాపిడో బైక్‌‌‌‌ను ఢీకొట్టిన ఇసుక లారీ.. డాక్టర్, ర్యాపిడో డ్రైవర్ మృతి

ర్యాపిడో బైక్‌‌‌‌ను ఢీకొట్టిన ఇసుక లారీ.. డాక్టర్, ర్యాపిడో డ్రైవర్ మృతి

హైదరాబాద్ ​సిటీ, వెలుగు:  ర్యాపిడో బైక్‎ను ఇసుక లారీ ఢీకొట్టడంతో.. దానిపై ప్రయాణిస్తున్న డాక్టర్‌‌‌‌‌‌‌‌తో పాటు ర్యాపిడో డ్రైవర్ మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం హైదరాబాద్‌‌‌‌లో జరిగింది.  ఖమ్మం జిల్లాలోని హవేలికి చెందిన యుద్ధంగల నవీన్ (30) కొంతకాలం కింద హైదరాబాద్‌‌‌‌కు​వచ్చి జేఎన్టీయూ సమీపంలో ఉంటున్నాడు.  ర్యాపిడోలో బైక్​నడుపుతున్నాడు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన జగదీశ్​చంద్ర (35) హైదరాబాద్‌‌‌‌లో ఉంటూ ఎంబీబీఎస్​పూర్తి చేశాడు. 

ప్రస్తుతం పీజీ చేస్తున్నాడు. కుందన్‌‌‌‌బాగ్‌‌‌‌లో ఉంటూ ఓ ప్రైవేట్​హాస్పిటల్‌‌‌‌లో పని చేస్తున్నాడు. అయితే డాక్టర్​ జగదీశ్ చంద్ర ఆదివారం ఉదయం ర్యాపిడో బైక్ బుక్​ చేసుకుని బయటకు వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఉదయం 5:30 గంటల టైమ్‌‌‌‌లో గ్రీన్‌‌‌‌ల్యాండ్స్ నుంచి బేగంపేట్ వైపు వెళ్తున్న ర్యాపిడో బైక్‌‌‌‌ను ఇసుక లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ర్యాపిడో డ్రైవర్ నవీన్ స్పాట్‌‌‌‌లోనే చనిపోయాడు.

తీవ్రగాయాలైన డాక్టర్ జగదీశ్ చంద్రను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా, ట్రీట్‌‌‌‌మెంట్ పొందుతూ మృతి చెందాడు. లారీ డ్రైవర్ పసుపుల శంకర్‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నామని పంజాగుట్ట సీఐ శోభన్​తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

కాగా, డాక్టర్ జగదీశ్ చంద్ర చనిపోయిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. హైదరాబాద్‌‌‌‌కు చేరుకుని బోరున విలపించారు. గొప్ప పేరున్న డాక్టర్​ అవుతాడని కలలు కన్నామని, తమ కలలు కల్లలయ్యాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.