ఎస్సై, సర్పంచ్ , ఉప సర్పంచ్​పై ఇసుక మాఫియా దాడి

ఎస్సై, సర్పంచ్ , ఉప సర్పంచ్​పై ఇసుక మాఫియా దాడి

కారు, బైక్ ​ధ్వంసం

సొమ్మసిల్లి పడిపోయిన ఉపసర్పంచ్

గన్నేరువరం, వెలుగు: ఎస్సై, సర్పంచ్, ఉపసర్పంచ్​పై ఇసుక మాఫియా దాడి చేసింది. ఈ ఘటన కరీంనగర్​జిల్లాలో చోటుచేసుకుంది. కరీంనగర్​జిల్లా గన్నేరువరం మండలంలోని చొక్కారావుపల్లె బిక్క వాగులో శుక్రవారం అర్ధరాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన సుమారు 50 ట్రాక్టర్లలో ఇసుక నింపుతున్నారు.  సమాచారం అందుకున్న గన్నేరువరం ఎస్సై ఆవుల తిరుపతి అర్ధరాత్రి వాగు వద్దకు వెళ్లారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లును అదుపులోకి  తీసుకోవడానికి ప్రయత్నించారు. ఇసుక అక్రమ రవాణాదారులు ఎదురు తిరగడంతో ఎస్సై స్థానిక సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డిలకు సమాచారం అందజేశారు. అక్కడకు వెళ్లిన సర్పంచ్, ఉప సర్పంచ్, ఎస్సైలపై ఒక్కసారిగా సుమారు 150 మంది దాడి చేశారు. దాడిలో సర్పంచ్ కరుణాకర్​రెడ్డి కారు ధ్వంసమైంది. మరో పల్సర్ బైక్ సైతం ధ్వంసం చేశారు. దుండగుల దాడితో ఉపసర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. విషయం తెలిసి గ్రామస్థులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో దుండగులు పారిపోయారు.

గ్రామస్థుల ఆందోళన

ఇసుక అక్రమ రవాణా, దాడి ఘటనను నిరసిస్తూ బిక్కవాగు సమీపంలోని కల్వర్టుపై టెంటు వేసి గ్రామస్తులు శనివారం ధర్నా చేశారు. ఇల్లంతకుంట మండల నాయకులు, పోలీసుల సహకారంతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా నడుస్తోందని మండిపడ్డారు. తమపై దాడి జరుగుతున్న సమయంలో ఇల్లంతకుంట పోలీసులు అక్కడే ఉన్నారని, వారు ఇసుక వ్యాపారులకు సహకరించినట్లు ఉపసర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి ఆరోపించారు. ఇసుక మాఫియా వెనుక సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్​సిద్ధం వేణు, పొత్తూర్ సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్  ఉన్నారని అన్నారు.  గ్రామస్థుల ధర్నా సమాచారం తెలుసుకున్న ఏసీపీ విజయ సారథి, సీఐ మహేష్ గౌడ్ అక్కడకు చేరుకుని వారితో మాట్లాడారు. దాడి చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

For More News..

ఫ్యామిలీ ప్లానింగ్‌‌పై బలవంతం చేయలేం

జీతాలియ్యట్లేదని ఐఫోన్ ఫ్యాక్టరీపై దాడి

ట్రంప్‌కు న్యాయపరంగా దారులన్నీ క్లోజ్