
- ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ రామకృష్ణారావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం సీఎస్ కె.రామకృష్ణా రావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కె.రామకృష్ణా రావు బాధ్యతలను నిర్వర్తించారు. సీనియర్ ఐఏఎస్ శాంతి కుమారి ఇటీవలే పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో కొత్త సీఎస్‌గా రామకృష్ణా రావును ప్రభుత్వం నియమించింది.
ఈ నేపథ్యంలోనే ఖాళీ అయిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పోస్ట్‌లో సందీప్ కుమార్ సుల్తానియాను నియమిస్తూ సీఎస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సందీప్ కుమార్ సుల్తానియా ఆర్థిక శాఖలోనే ఒక ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు. అయితే రామకృష్ణారావు నుంచి మంగళవారం పూర్తి బాధ్యతలను తీసుకున్నారు.