ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా ఇండియా హెడ్‌గా సంధ్య దేవనాథన్ ను నియమించింది. వచ్చే ఏడాది 2023, జనవరి 1న ఆమె బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుతం మెటా ఆసియా పసిఫిక్ డివిజన్ గేమింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ గా ఆమె బాధ్యతలు కొనసాగిస్తున్నారు. అంతకుముందు మెటా సింగపూర్ ఎండీ, మెటా వియత్నాం బిజినెస్ హెడ్ గా సంధ్య వ్యవహరించారు. బ్యాంకింగ్, పేమెంట్స్, టెక్నాలజీ వంటి విభాగాల్లో సంధ్య దేవనాథన్ కు 22 సంవత్సరాల అనుభవం ఉంది.
సంధ్య దేవనాథన్ 2000 సంవత్సరంలో ఢిల్లీ యూనివర్శిటీ నుంచి ఫ్యాకల్టీ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత 2016లో ఆమె సింగపూర్, వియత్నాంలలో మెటా బిజినెస్ అభివృద్ధి బాధ్యతలు చేపట్టారు. వ్యాపార నిర్వహణ, టీమ్ మేనేజ్‌మెంట్, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలలో సంధ్యకు ఉన్న అనుభవం.. మెటా సంస్థ భారత్‌లో బలపడేందుకు మరింత తోడ్పడుతుందని మెటా సంస్థ అభిప్రాయపడుతోంది.
అంతకుముందు.. మెటా ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్‌గా శివనాథ్ తుక్రాల్ పనిచేశారు. గతంలో ఈయన వాట్సాప్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. కొద్దిరోజుల క్రితం మెటా ఇండియా హెడ్‌గా ఉన్న అజిత్ మోహన్ తన పదవి నుంచి వైదొలిగారు. తర్వాత మెటా పబ్లిక్ పాలసీ విభాగాధిపతి రాజీవ్ అగర్వాల్, వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ సైతం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వారి స్థానంలో మెటా సంస్థ కొత్తవారిని నియమించింది.

