బెంగళూరు: బెంగళూరులో ఘోరం జరిగింది. జూన్ 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 13న బెంగళూరులో ఒక 22 ఏళ్ల యువతి తన అద్దె ఇంట్లో శవమై కనిపించింది. ఆమెను హత్య చేసి, ఆ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించిన ఆరోపణలపై పోలీసులు ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. బాధితురాలిని మాగడి మెయిన్ రోడ్డులోని తులసి నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్న భవానీ ఎస్ అనే మహిళగా గుర్తించారు.
భవానీ అనే యువతి డిగ్రీ పూర్తి చేశాక.. తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలవాలనుకుంది. జాబ్ కోసం బెంగళూరుకు వచ్చింది. ఆమె ఒక మొబైల్ షోరూమ్‌లో బిల్లింగ్ క్లర్క్‌గా పనిచేసేది. తన జీతం నుంచి కొంత డబ్బును ఇంటికి పంపేది.
ఈ క్రమంలోనే.. ఆమెకు చంద్రశేఖర్ అలియాస్ చందన్ అనే ఆటో డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి ఉండటమే కాదు ఏడాది క్రితం రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ టోటల్ ఎపిసోడ్లో అసలు ట్విస్ట్ ఏంటంటే.. చందుకు అప్పటికే పెళ్లైంది. ఆరేళ్ల పాప కూడా ఉంది. ఈ విషయం భవానీకి తెలిసింది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి.. చేయి పట్టుకుని నడిస్తే.. మరొకరిని పెళ్లి చేసుకుని.. పిల్లలు కూడా ఉన్న విషయం దాచడంపై భవానీ కలత చెందింది. ఈ క్రమంలోనే.. భవానీ తన తల్లిదండ్రులు చూపించిన సంబంధానికి ఓకే చెప్పింది.
►ALSO READ | ఎంత పనిచేశావ్ రా బుడ్డోడా.. రెండే రెండు సెకన్లు.. ఐఫోన్ నీళ్లలోకి విసిరేశాడు !
ఈ క్రమంలో భవానీ ఉంటున్న అద్దె ఇంటికి వెళ్లిన చందు ఆమెతో గొడవ పడ్డాడు. "నేను నువ్వు లేకుండా బతకలేను. మనం కలిసి బ్రతుకుదాం లేదా మనమిద్దరం ఆత్మహత్య చేసుకుందాం" అని అన్నాడు. కానీ భవానీ ఆత్మహత్య చేసుకోవడానికి నిరాకరించింది. అతని కోపం కట్టలు తెంచుకుంది. చంద్రశేఖర్ భవానీని పెళ్లి చేసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు.
భవానీ కుటుంబ సభ్యులకు తెలిసేలా ఈ ఫోటోను పోస్ట్ చేయడంతో ఈ ఫొటో చూసి భవానీకి ఆమె పేరెంట్స్ ఫోన్ చేశారు. ఇలా చేశావేంటని.. భవానీ చంద్రశేఖర్‌తో గొడవకు దిగింది. ఈ గొడవ పెద్దదైంది. చంద్రశేఖర్ భవానీ గొంతు నులిమి హత్య చేసి, ఆ తర్వాత విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లుగా నటించాడు.
