మెఘా దగా…మన ప్రాజెక్టులు, మనల్నిముంచే ప్రాజెక్టులు అన్నీ ఆంధ్రా కంపెనీకే

మెఘా దగా…మన ప్రాజెక్టులు, మనల్నిముంచే ప్రాజెక్టులు అన్నీ ఆంధ్రా కంపెనీకే

సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌ స్కీంటెండర్ మేఘా కంపెనీకే దక్కింది. సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌ స్కీంటెండర్ మేఘా కంపెనీకే దక్కింది. తెలంగాణలో కాళేశ్వరం సహా లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు చేస్తున్న ఈ ఆంధ్రా కంపెనీయే.. తెలంగాణ నీళ్లకు గండి కొట్టేలా ఏపీ చేపట్టిన ప్రాజెక్టు కూడా కట్టబోతోంది. ఇటు తెలంగాణలో బడా కాంట్రాక్టులు చేపట్టి ప్రయోజనం పొందిన కంపెనీ.. అదే తెలంగాణకు తీవ్ర నష్టం చేసే ప్రాజెక్టు చేపట్టడం వెనుక పెద్ద కుట్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే కంపెనీలను మన రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని, ఇక్కడ అప్పగించిన పనులన్నింటినీ రద్దు చేయాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. మేఘా కంపెనీని రెండు రాష్ట్రాల సీఎంలు వెనుకేసుకు వస్తున్నారనే ప్రచారానికి ఈ సంగమేశ్వరం టెండర్ల వ్యవహారం బలం చేకూరుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు చేజిక్కించుకున్న ఆంధ్రా కంపెనీకే.. ఇప్పుడు తెలంగాణ వచ్చాక ఇక్కడి ప్రాజెక్టులు కూడా దక్కడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాల్లో.. నీళ్లు ఏపీకి వెళ్లి పోతున్నాయని, నిధులు ఏపీ కంపెనీల జేబుల్లోకి పోతున్నాయని, నియామకాల్లేక నిరుద్యోగులు గోస పడుతున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

గత ఆరేండ్లలో తెలంగాణలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇంటింటికీ నల్లానీళ్లు ఇచ్చే మిషన్ భగీరథతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్ల పనులు చాలావరకు ఒక్క మేఘా కంపెనీకే దక్కాయి. వాటన్నింటి విలువ దాదాపు రూ.లక్ష కోట్లు. సర్కారుతో ఉన్న దగ్గ రి సంబంధాలతో ఈ కంపెనీ కొన్ని పనులను టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిపై చేజిక్కించుకుంది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజె క్టులో సగానికిపైగా పనులను మేఘా కంపెనీ చేపట్టింది. నంది మేడారం పంపుహౌస్‌ మినహా మిగతా అన్ని పంపుహౌస్‌లను సర్కారు ఈ సంస్థ కే కట్టబెట్టింది. రూ.4,659 కోట్లతో చేపట్టిన థర్డ్ టీఎంసీ పనులను అసలు టెండర్‌ లేకుండానే నామినేషన్‌ పద్ధ తిన అప్పగించారు. రూ.21,458 కోట్ల విలువైన లింక్‌–2, లింక్‌–4 అడిషనల్‌ టీఎంసీ పనుల్లోనూ మేఘా సంస్థ రూ.15 వేల కోట్ల పనులను సొంతం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కరెంటు అవసరాల కోసం నిర్మించిన మూడు భారీ సబ్ స్టేషన్లను మేఘానే నిర్మించింది. మొత్తంగా ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ రూ.65 వేల కోట్లకుపైగా పనులు చేస్తోంది. ఇక పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో మూడు పంపుహౌస్‌లు, సీతారామ లిఫ్ట్‌స్కీంలో సగం పనులు, భక్తరామదాసు లిఫ్ట్‌స్కీంను ఈ కంపెనీయే చేపట్టింది. దేవాదుల థర్డ్ ఫేజ్ ‌లో కీలక పంపుహౌస్‌ పనులను ఈ సంస్థ నే చేస్తోంది.కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టు అంచనాల పెంపు వెనుక ఈ ప్రాజెక్టు ఆర్థిక ప్రయోజనాలే ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

నల్లా నీళ్లు..హైదరాబాద్రోడ్లు వాళ్లకే..

రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చేమిషన్‌ ‌‌‌భగీరథ ప్రాజెక్టులోనూ మేఘాదే పెద్దవాటా. రూ.40 వేల కోట్లతో చేపట్టిన పనుల్లో రూ.10 వేల కోట్లకు పైగా పనులు ఈ సంస్థచేపట్టింది. సీఎం సొంత నియోజ కవర్గం గజ్వేల్‌‌‌‌లో ఈ కంపెనీయే పనులు చేసింది. రాష్ట్రంలో పలు రోడ్లు, ఇతర పనులను మేఘా ఇంజనీరింగ్ చేస్తోంది. అన్ని పనులు కలిపి రూ.లక్ష కోట్లకు పైగా మేఘాకే కట్టబెట్టారు. ఇందులో 90 శాతానికిపైగా పనులు ఇరిగేషన్‌‌‌‌, భగీరథ ప్రాజెక్టులవే. ఆర్టీసీని సైతం ఈ సంస్థకు అప్పగించడానికి సర్కారు ప్రయత్నించిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దాదాపు 40 ఎలక్ట్రిక్‌‌‌‌ బస్సులను ఈ కంపెనీ రంగంలోకి తేవడం వెనుక ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం జరిగింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్పరిధిలో రోడ్ల రిపేర్లను సైతం రాష్ట్రసర్కారు ఇదే కంపెనీకి కట్టబెట్టింది. ఇటీవలే రూ.698 కోట్ల రోడ్ల పనులను అప్పగించింది.

ఏపీలో కూడా మేఘా హవా

ఉమ్మడి రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులను సొంతం చేసు కున్న మేఘా ఇంజనీరింగ్‌‌‌‌ కంపెనీ.. రాష్ట్రవిభజన తర్వాత తెలంగాణతోపాటు ఏపీలో కూడా కీలక ప్రాజెక్టులు దక్కించుకుంది. పట్టిసీమ, పురుషోత్తమపట్నం, చింతలపూడి, కొరిసపాడు లిఫ్ట్‌‌‌‌లు, వెలిగొండ ప్రాజెక్టు, హెచ్‌ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌పనులను ఆ సంస్థ నే చేపట్టింది. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌‌‌‌లో కీలక పనులు దక్కించుకుంది. ఇప్పుడు సంగమేశ్వరం (రాయల సీమ) లిఫ్ట్‌‌‌‌స్కీంలో ప్రధాన పంపుహౌస్‌‌‌‌ పనులను మేఘానే సొంతం చేసుకుంది. రివర్స్బిడ్డింగ్‌‌‌‌ లో 0.88 శాతం ఎక్సెస్‌‌‌‌కోట్‌ ‌‌‌చేసిన మేఘా, ఎస్పీఎంఎ ల్‌‌‌‌, ఎన్‌‌‌‌సీసీ కంపెనీల జాయింట్ వెంచర్కు ఏపీ ప్రభుత్వం పనులను అప్పగించింది. రూ.3,278 కోట్ల అంచనాతో పిలిచిన టెండర్లు ఫైనల్ గా రూ.3,307 కోట్లకు ఖరారయ్యాయి. ఇక ‘రాయలసీమ డ్రాట్‌‌‌‌ మిటిగేషన్‌‌‌‌స్కీం’ కింద పోలవరం నుంచి కృష్ణా , పెన్నా బేసిన్లను లింక్‌‌‌‌చేసే ప్రాజెక్టులో కూడా కీలక పనులు ఈ సంస్థ కే దక్కుతాయని ప్రచారంలో ఉంది.

సొంతరాష్ట్రమొచ్చినా..

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలోనూ ఇక్కడి కాంట్రాక్టర్లకు పెద్దకాంట్రాక్టులు దక్కడం లేదు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా, సమైక్య ఉద్య మానికి స్పాన్సర్‌‌‌‌గా వ్యవహరించిందన్న ఆరోపణలు ఎదుర్కొన్న మేఘా కంపెనీనే ఇప్పుడు తెలంగాణలో రింగ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌గా వ్యవహరిస్తోంది. మన గుత్తే దారులు ఆ సంస్థ ఇచ్చే సబ్‌ కాంట్రాక్టులు చేసుకోవడం తప్ప టెండర్లలో సొంతంగా పనులు దక్కించుకోలేక పోతున్నారు. కేసీఆర్‌ ‌‌‌కుటుంబానికి సన్నిహితంగా ఉండే ప్రతిమ లాంటి సంస్థలకు తప్ప వేరే వర్క్‌‌‌‌ఏజెన్సీలకు కీలక ప్రాజెక్టులేవీ దక్కకట్లేదని ఇరిగేషన్ వర్గాలే చెప్తున్నాయి. రాష్ట్రంలో రూ.2 లక్షల కోట్లతో ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టులు చేపడుతుండగా అందులో సగానికిపైగా మేఘానే సొంతంచేసుకుందంటే ఆ సంస్థతో సర్కారు పెద్దలకు అనుబంధం స్పష్టమవుతోంది.

శ్రీశైలంలో ప్రతిచుక్క నీళ్లు తోడుకుపోయేలా..

శ్రీశైలం ప్రాజెక్టులో చేరే ప్రతి చుక్క నీటిని రాయలసీమకు మళ్లించుకుపోయేలా ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం లిఫ్ట్‌‌‌‌స్కీంను ప్రతిపాదించింది. రిజర్వాయర్ నిండకముందే కుండకు చిల్లు పెట్టినట్టుగా అడుగు నుంచే నీళ్లను తరలించుకునేందుకు చేసింది. అది పూర్తయితే తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు– రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌ ‌‌‌స్కీంలతోపాటు ఇప్పటికే పూర్త యిన కల్వకుర్తి, ఎస్‌‌‌‌ఎల్బీసీ ప్రాజెక్టులకు నీళ్లందని పరిస్థి తి ఏర్పడుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువన నాగార్జున సాగర్‌‌‌‌ఎడమ కాల్వ, ఏఎమ్మార్పీ, హైదరా బాద్‌తాగునీటికి కూడా గండంతప్పని పరిస్థి తి. ఇప్ప టికే కోటా మేర నీటిని అయినా ఉపయోగించుకోలేక పోతున్న తెలంగాణకు.. సంగమేశ్వరం పూర్తయితే చుక్క నీళ్లుకూడా అందకుండా పోయే ప్రమాదం ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌‌‌‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలతోపాటు ఖమ్మం జిల్లాలోని కొంత ప్రాం తంపైనా తీవ్రంగా ఎఫెక్ట్ పడుతుంది.

ఇక్కడ కాంట్రాక్టులు రద్దు చేయాలి

తెలంగాణను ముంచే ప్రాజెక్టులు చేపడుతున్న మేఘా లాంటి కంపెనీలకు రాష్ట్రంలో కాంట్రాక్టులు రద్దు చేయాలని బీజేపీ కోర్‌‌‌‌కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ జి. వివేక్‌‌‌‌వెంకటస్వామి అన్నారు. ఏపీ సీఎం జగన్ తో సీఎం కేసీఆర్ కు మ్మక్కై మేఘా కృష్ణా రెడ్డికి సంగమేశ్వరం ప్రాజెక్టు పనులు దక్కేలా చేశారని ఆయన మండిపడ్డారు. దీనిపై తాను ముందు నుంచీ చెప్తూ వచ్చానని గుర్తుచేశారు. సంగమేశ్వరం ప్రాజెక్టు వల్ల దక్షిణ తెలంగాణ ఎడారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కమీషన్ల కోసం తెలంగాణకు ద్రోహం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని, కావాలని అపెక్స్కౌన్సిల్ మీటింగ్ను వాయిదా వేయించు కొని మేఘాకు సంగమేశ్వరం పనులు దక్కేలా చూశారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రాజెక్టుల ఎస్టిమేషన్స్ను భారీగా పెంచి ఆంధ్రా కాంట్రాకర్ట్లకు దోచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రా కాంట్రాక్టర్లను తొలగించాలి

‘‘ఆంధ్రా కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డికి కాళేశ్వరం పనులు అప్పగించి తెలంగాణ సర్కారే పెంచి పోషించింది. ఇవాళ అదే వ్యక్తి తెలంగాణ నీళ్లను దోచుకెళ్లే సంగమేశ్వరం ప్రాజెక్టు టెండర్ దక్కించుకున్నరు. ఉమ్మడి ఏపీలో ఆంధ్రా పాలకులు ఆంధ్రా ప్రాంత కాంట్రాక్టర్లకే పనులు అప్పగించారు. ఇప్పుడు కూడా వాళ్లకే ఇస్తున్నరు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే సంగమేశ్వరం ప్రాజెక్టును చేపట్టిన మేఘాను భవిష్యత్‌‌‌‌లో రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వొద్దు’’

-ప్రొఫెసర్ కోదండరాం,టీజేఎస్ చీఫ్