సంగారెడ్డి జిల్లాలో దృష్టిలోపం ఉన్నవారి కోసం సౌండ్ లైబ్రరీ..రాష్ట్రంలోనే మొట్ట మొదటిది : కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లాలో దృష్టిలోపం ఉన్నవారి కోసం సౌండ్ లైబ్రరీ..రాష్ట్రంలోనే మొట్ట మొదటిది : కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో దృష్టిలోపం ఉన్నవారి కోసం అంధుల శ్రవణ గ్రంథాలయం (సౌండ్ లైబ్రరీ) ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం అంధుల శ్రవణ గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్యతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ..ఈ సౌండ్ లైబ్రరీ ద్వారా దృష్టిలోపం గల వారు కంప్యూటర్ వినియోగం, పుస్తక పఠనం, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటి కార్యకలాపాలను నిర్వహించవచ్చన్నారు. 

ప్రత్యేక సాఫ్ట్​వేర్ సాయంతో కంప్యూటర్‌ను పూర్తి స్థాయిలో ఆపరేట్ చేయడం, చదువు, అభ్యాసం, డాక్యుమెంట్ల వినియోగం వంటి పనులు సులభంగా చేసుకోవచ్చని సూచించారు. ఈ లైబ్రరీలో భారతీయ భాషల స్కాన్ అండ్ రీడ్ సౌకర్యం అందుబాటులో ఉందని చెప్పారు. దీని ద్వారా విజువల్లీ చాలెంజ్​డ్​ విద్యార్థులు ముద్రిత పుస్తకాలను నేరుగా స్కాన్ చేసి చదవగలరన్నారు. ఆఫ్‌లైన్‌తో పాటు గూగుల్ ఏఐ ఆధారిత ఆన్‌లైన్ విధానాలు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు. 

ఎమ్మెల్యే  చింతా ప్రభాకర్ మాట్లాడుతూ దివ్యాంగులు ఈ సౌకర్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆలోచన మేరకు ఈ సౌండ్ లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  సద్వినియోగం చేసుకున్నప్పుడే దీనికి సార్థకత ఉంటుందని పేర్కొన్నారు. 

అంతకు ముందు లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు నిర్వహించి ప్రత్యేక క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వసుంధర, పంచాయతీ రాజ్ శాఖ డీఈ దీపక్, వివిధ దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు, డీడబ్ల్యూఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది, దివ్యాంగులు పాల్గొన్నారు.