నకిలీ వేలిముద్రలతో జీతాలు కొట్టేస్తున్నరు

నకిలీ వేలిముద్రలతో జీతాలు కొట్టేస్తున్నరు
  •    ఇద్దరు బల్దియా శానిటరీఫీల్డ్ అసిస్టెంట్ల అరెస్ట్
  •     పరారీలో మరొకరు ..

బషీర్ బాగ్, వెలుగు : బల్దియా శానిటేషన్ సిబ్బంది ఫింగర్ ప్రింట్ క్లోనింగ్ చేసి, నకిలీ వేలిముద్రలతో జీతాలు కొట్టేస్తున్న ఇద్దరు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు అరెస్ట్ అయ్యారు.  ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. బల్దియా సర్కిల్ –14  గోషామహల్ లో  విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు​ ఎ.సాయినాథ్, నాగరాజు, వి. విజయ్ కుమార్ లు  శానిటేషన్ సిబ్బంది డైలీ అటెండెన్స్ బయోమెట్రిక్ ద్వారా తీసుకుంటారు. అక్రమ దందాకు ప్లాన్ వేసి.. ఫింగర్ ప్రింట్ తీసుకొనే సమయంలో బయోమెట్రిక్ మెషీన్ కు ఫెవిగమ్ తో దానిపై క్యాండిల్ వాక్స్( కొవ్వొత్తి మైనం) పూసి సిబ్బంది వేలిముద్రలను సేకరించారు.

ఇలా సిబ్బందికి తెలియకుండా 31 మందికి చెందిన నకిలీ వేలిముద్రలు తయారు చేశారు. వారు డ్యూటీలకు హాజరు కానప్పుడు  నకిలీ వేలిముద్రతో అటెండెన్స్ వేసి వారీ జీతాలు తీసుకుంటున్నారు. దీనిపై సమాచారం అందడంతో ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫీల్డ్ అసిస్టెంట్లను అదుపులోకి తీసుకుని..  వారి వద్ద 31 మంది నకిలీ వేలిముద్రలు, 3 బయోమెట్రిక్ మెషీన్లను స్వాధీనం చేసుకున్నారు. చట్టపరమైన చర్యలకు  నాంపల్లి, అబిడ్స్ పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు విజయ్ కుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.