సీఎంసీ ఎదుట స్వచ్ఛ కార్మికుల ధర్నా.. ఎలక్ట్రిక్ వాహనాలు వద్దంటూ ఆందోళన..

సీఎంసీ ఎదుట స్వచ్ఛ కార్మికుల ధర్నా.. ఎలక్ట్రిక్ వాహనాలు వద్దంటూ ఆందోళన..
  • ఆస్తిపన్నులో చెత్త డబ్బులు కామెంట్స్​పై ఫైర్​
  • గేట్లు ఎక్కి లోపలికి వెళ్లే యత్నం  
  • అడ్డుకున్న పోలీసులు.. తోపులాట 
  • సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌ను ముట్టడిస్తామని హెచ్చరిక

హైదరాబాద్ సిటీ, వెలుగు: చెత్త సేకరణకు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ను ప్రవేశపెడతామన్న సీఎంసీ కమిషనర్ సృజన వ్యాఖ్యలను నిరసిస్తూ స్వచ్ఛ ఆటో కార్మికులు మంగళవారం సైబరాబాద్​మున్సిపల్​కార్పొరేషన్​ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్ అండ్ రిక్షా కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది చెత్త సేకరణ కార్మికులు ఆఫీసును ముట్టడించారు. ‘రాంకీ గో బ్యాక్’ అంటూ కార్మికులు నినాదాలు చేశారు. 

ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులను భారీగా మోహరించారు. ఈ క్రమంలో కొందరు కార్మికులు గేటును తోసుకుని లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. యూనియన్ జీహెచ్ఎంసీ ప్రెసిడెంట్ కత్రావత్ గోపాల్ నాయక్ మాట్లాడుతూ స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్, కమిషనర్ సృజన  కలిసి ఎలక్ట్రికల్ ఆటోల పేరుతో కొత్త ఆటోలను ప్రవేశపెట్టి తమ పొట్ట కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. 

వేలాది మంది అప్పులు చేసి ఆటోలు కొని బతుకుతున్నారని  కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను తెస్తామనడం కరెక్ట్​కాదన్నారు. తమను పాత పద్ధతిలోనే పారిశుద్ధ్య పనుల్లో కొనసాగించాలని, ఆస్తి పన్నుతో కలిపి చెత్త పన్ను వసూలు చేసే విధానాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. డిమాండ్లను పరిష్కరించకపోతే త్వరలో సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.  ప్రభుత్వం తమతో చర్చించి తమ బాధను వినాలని కోరారు. హంసరాజు, అర్జున్, లక్ష్మన్, రాము, రమేష్, ప్రభాకర్ పాల్గొన్నారు.