- మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1 వరకు ‘సరస్వతీ అంత్య పుష్కరాలను’ వైభవంగా నిర్వహించనున్నట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. బుధవారం సెక్రటేరియెట్‌లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆమె పుష్కరాల అధికారిక పోస్టర్, టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడారు.12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలకు సుమారు 30 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రూ.30.63 కోట్లతో 162 అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో భక్తులు పుష్కర స్నానం, స్వామి దర్శనం చేసుకొనేలా ఏర్పాట్లు చేయాలని, అన్నిశాఖల సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
10 రోజుల ముందే పనులు పూర్తి కావాలి: మంత్రి శ్రీధర్ బాబు
పుష్కరాల పనులన్ని ప్రారంభానికి 10 రోజుల ముందే పూర్తి కావాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. కాళేశ్వరం ఆలయ పునర్నిర్మాణానికి రూ.198 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. మే 21న ఉదయం 5.43 గంటలకు కంచికామకోటి పీఠాధిపతి శంకర విజేంద్ర సరస్వతీ స్వామి తొలి పుష్కర స్నానం చేస్తారని వెల్లడించారు. ప్రతిరోజూ సాయంత్రం 6:30 గంటలకు త్రివేణి సంగమం వద్ద కాశీ పండితులతో ఘనంగా హారతి కార్యక్రమం ఉంటుందన్నారు. భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఆలయ ట్రస్ట్ చైర్మన్ మోహన్ శర్మ ఉన్నారు.

