
- 15 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్
జయశంకర్ భూపాలపల్లి/ మహాదేవ్‌పూర్, వెలుగు: వీకెండ్ కావడంతో సరస్వతి పుష్కరాలకు భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. కాళేశ్వరం వెళ్లే దారులన్నీ ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వెహికల్స్‌తో కిక్కిరిసిపోయాయి. దీంతో 15 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహదేవపూర్, కాళేశ్వరం రూట్‌లో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఎండకు తాళలేక చిన్నారులు నీరసించిపోయారు. జనం వెహికల్స్‌ను రోడ్లపై వదిలేసి పక్కనే ఉన్న చెట్ల కింద సేదతీరారు. తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడంతో అల్లాడిపోయారు. కాళేశ్వరంలోని గోదావరి నుంచి చెల్పూర్ జెన్ కో వరకు వేసిన పైప్‌లైన్ లీకేజీ నీటిని పట్టుకుని దూప తీర్చుకున్నారు. మరికొందరు తమ వాహనాలను రోడ్డు పక్కనే పార్క్ చేసి కాలినడకన పుష్కర ఘాట్లకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే వెంటనే స్పందించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
ట్యాక్స్ వసూళ్లతో భారీగా ట్రాఫిక్ జామ్
శనివారం తెల్లవారుజాము నుంచే కాళేశ్వరం రూట్‌లో వాహనాల రద్దీ పెరిగింది. ఒక్కో వెహికల్‌కు రూ.100 చొప్పున ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. డబ్బులు చెల్లించిన వాహనాలనే పార్కింగ్‌కు అనుమతిస్తున్నారు. డబ్బులు తీసుకుని.. చీటి రాసి ఇస్తుండటంతో ఆలస్యమవుతున్నది. దీంతో ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయింది.
వరంగల్ మీదుగా మహాదేవ్‌పూర్ నుంచి, కరీంనగర్ నుంచి మంథని, కాటారం మీదుగా పుష్కర ఘాట్లకు వెళ్లే వాహనాలన్నింటికి ట్యాక్స్ వసూలు చేస్తుండటంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కాళేశ్వరం నుంచి మహాదేవ్‌పూర్ వరకు 18 కిలో మీటర్ల మేర అడవి ఉంటుంది. ట్రాఫిక్ జామ్‌తో మహాదేవ్‌పూర్ నుంచి కాళేశ్వరం చేరుకోవడానికి 4 గంటల టైమ్ పట్టింది. కాగా, ట్యాక్స్ వసూళ్లను రద్దు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ ప్రకటించారు. పుష్కరాలు ముగిసే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందన్నారు.
భట్టి విక్రమార్క, తుమ్మల పుష్కర స్నానాలు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తన తమ్ముడు ప్రసాద్‌తో కలిసి పెద్దలకు పిండ ప్రదానం చేశారు. తర్వాత పుష్కర స్నానం చేసి కాళేశ్వరున్ని దర్శించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదిగి ప్రపంచంతో పోటీపడాలని స్వామి వారిని మొక్కుకున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా కుటుంబ సమేతంగా పుష్కర స్నానమాచరించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సరస్వతి పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
వన్ వే రూట్ అమలు
వన్ వే రూట్ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ చెప్పారు. వరంగల్, భూపాలపల్లి మీదుగా, కరీంనగర్, మంథని మీదుగా, ములుగు, గణపురం, మేడారం మీదుగా వచ్చే వాహనాలన్నీ మహాదేవ్‌పూర్ మీదుగా కాళేశ్వరంలోని పార్కింగ్ ప్లేస్‌లకు చేరుకోవాలి. తిరిగి వెళ్లేటప్పుడు కాళేశ్వరం నుంచి మద్దెలపల్లి మీదుగా గంగారం క్రాస్ చేరుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని కాటారం చేరుకొని వరంగల్‌కు వెళ్లాలి. కరీంనగర్ వెళ్లేవాళ్లు గంగారం క్రాస్ నుంచి రైట్ తీసుకొని మంథని రూట్‌లో వెళ్లాలి. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ నుంచి వచ్చే భక్తుల కోసం కన్నెపల్లి దగ్గర పార్కింగ్ కేటాయించారు.
కాళేశ్వరంలో గాలివాన బీభత్సం
శుక్రవారం అర్ధరాత్రి కాళేశ్వరంలో గాలివాన బీభత్సం సృష్టించింది. భక్తుల కోసం వేసిన టెంట్లు ఎగిరిపోయాయి. సరస్వతి ఘాట్ దగ్గర వేసిన చలువ పందిళ్లు, గ్రీన్ మ్యాట్లు ధ్వంసం అయ్యాయి. చలివేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు కూడా పడిపోయినయ్. కరెంట్ వైర్లు తెగిపడ్డయ్. దీంతో కాళేశ్వరంలో రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రంగంలోకి దిగిన అధికారులు.. కరెంట్ సప్లై పునరుద్ధరించారు. టెంట్లు, మ్యాట్లు, చలువ పందిళ్లు సెట్ చేశారు.