SMAT 2025: టీమిండియా టెస్ట్ ప్లేయర్స్ మెరుపు సెంచరీలు.. ముగ్గురూ ఊర మాస్ ఇన్నింగ్స్

SMAT 2025: టీమిండియా టెస్ట్ ప్లేయర్స్ మెరుపు సెంచరీలు.. ముగ్గురూ ఊర మాస్ ఇన్నింగ్స్

టీమిండియా టెస్ట్ ప్లేయర్స్ గా ముద్ర పడిన ముగ్గురు ఆటగాళ్లు ఐపీఎల్ మినీ ఆక్షన్ కు ముందు విధ్వంసకర సెంచరీలతో సత్తా చాటారు. ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్, దేవ్ దత్ పడికల్ సెంచరీ కొట్టి తాము టెస్టులకే కాదు టీ20 ఆటగాళ్లు అని నిరూపించే పనిలో ఉన్నారు. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనున్న ఐపీఎల్ మినీ వేలంలో జాక్ పాట్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. టీమిండియా టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న వీరు ముగ్గురు ముస్తాక్ అలీ ట్రోఫీలో ఎల్ ఆడారో ఇప్పుడు చూద్దాం.. 

అభిమన్యు ఈశ్వరన్ ఊర మాస్:

దేశవాళీ క్రికెట్ లో అభిమన్యు ఈశ్వరన్ కు టెస్ట్ ప్లేయర్ గా పేరుంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ తర్వాత భారత టెస్ట్ స్క్వాడ్ లో స్థానం కోల్పోయిన ఈశ్వరన్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెలరేగి సెంచరీ చేశాడు. ఆదివారం (డిసెంబర్ 30) పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో దుమ్ములేపాడు. కేవలం 66 బంతుల్లోనే 130 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈశ్వరన్ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 8 సిక్సర్లున్నాయి. ఈ మ్యాచ్ లో బెంగాల్ చేసిన 198 పరుగులో ఈశ్వరన్ ఒక్కడే 130 పరుగులు చేయడం విశేషం. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇది రెండో అత్యధిక స్కోర్ కావడం విశేషం. 311 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగాల్ నిర్ణీత 20 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో పంజాబ్ 112 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.   

45 బంతుల్లో పడికల్ సెంచరీ:
 
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దేవదత్ పడిక్కల్ 46 బంతుల్లో 102 పరుగులు చేసి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. పడిక్కల్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు  ఉన్నాయి. ఐపీఎల్ మినీ వేలానికి ముందు పడికల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసుకుంది. పడిక్కల్ ఇన్నింగ్స్‌తో మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 245 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో తమిళనాడు కేవలం 100 పరుగులకే ఆలౌట్ కావడంతో బెంగాల్ 145 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ స్క్వాడ్ లో పడికల్ కు ఛాన్స్ లభించినా.. ప్లేయింగ్ 11 లో ఆడే అవకాశం లభించలేదు. 

సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసం:  

భారత టెస్ట్ జట్టులో చోటు కోసం పోరాడుతున్న సర్ఫరాజ్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. మంగళవారం (డిసెంబర్ 2) అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో 47 బంతుల్లోనే సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్ గా 47 బంతుల్లో 8 బౌండరీలు, 7 సిక్సర్లతో అజేయంగా 100 పరుగులు చేసి మినీ ఆక్షన్ లో భారీ ధర పలికేందుకు సిద్ధమయ్యాడు. సర్ఫరాజ్ సెంచరీతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో అస్సాం కేవలం 121 పరుగులకే ఆలౌట్ అయింది.