1980 దశకంలో దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటి సరిత. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో 150 చిత్రాలకు పైగా నటించి సినీ ప్రియుల మన్ననలను పొందారు. కేవలం అందంతోనే కాదు.. కళ్ళతోనే తన భావాలను పలికించగల అద్భుత నటన ఆమె సొంతం. సినీ ఇండస్ట్రీలోని అగ్ర నటీమణుల్లో ఒకరుగా నిలిచిన ఈ నటి నిజ జీవితం మాత్రం కన్నీటి గాథగా మిగిలిపోయింది. లేటెస్ట్ గా తన జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను ఒక ఇంటర్వ్యూలో పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు..
మారో చరిత్రతో అగ్రనటిగా..
లెజెడంరీ దర్శకుడు కె. బాలచందర్ ఆవిష్కరించిన ' మరో చరిత్ర' ప్రేమకథా చిత్రంలో కమల్ హాసన్ సరసన సరిత పోషించిన పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా సృష్టించిన రికార్డులతో సరితను దక్షిణాదిలో అగ్రనటిగా నిలబెట్టింది. 'అగ్నిసాక్షి', 'కల్యాణ అగాతిగల్', 'అచ్చమిల్లై అచ్చమిల్లై' వంటి చిత్రాలు ఆమె నటనలోని గాంభీర్యాన్ని చాటిచెప్పాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తనదైన ముద్ర వేసిన సరిత, మమ్ముట్టి వంటి స్టార్ హీరోల సరసన భావోద్వేగపూరిత పాత్రల్లో నటించి మెప్పించారు.
మౌనం వెనుక మాయని గాయాలు
1988లో నటుడు ముఖేష్‌ను సరిత వివాహం చేసుకుంది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నా కుటుంబం కోసం సినిమాలకు దూరమయ్యారు. కానీ ఆ వైవాహిక జీవితం ఆమెకు ఊహించని నరకాన్ని చూపించిందంటూ.. చాలా ఏళ్ల తర్వాత సరిత నోరు విప్పారు. తనపై జరిగిన శారీరక, మానసిక వేధింపుల గురించి వివరించారు.. గర్భవతిగా ఉన్న సమయంలోనూ కనికరం లేకుండా ముఖేష్ తనపై దాడి చేసేవాడని, తన బాధను చూసి నువ్వు గొప్ప నటివి కదా.. ఇంకా ఏడువు అంటూ ఎగతాళి చేసేవాడని సరిత ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ముఖేష్ తండ్రి పట్ల ఉన్న గౌరవంతో ఇన్నేళ్లు మౌనంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.
'మావీరన్'తో రీఎంట్రీ..
పరస్త్రీలతో సంబంధాలు, నిరంతర వేధింపుల మధ్య ఒంటరి పోరాటం చేసిన సరిత 2011లో ముఖేష్ నుంచి విడాకులు తీసుకుంది. తన ఇద్దరు కుమారులతో కలిసి జీవిస్తుంది. తన గొంతుతో ప్రేక్షకులను పలకరిస్తూ.. ఎంతో మంది నటీమణులకు డబ్బింగ్ చెప్పి ఆ పాత్రలకు ప్రాణం పోశారు. ఎన్నో ఏళ్ల విరామం తర్వాత శివకార్తికేయన్ నటించిన 'మావీరన్ 'లో మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు సరిత. ఈ మూవీలో తల్లి పాత్రలో నటించి మెప్పించింది.
