ఫండ్స్ లేవ్.. అధికారాల్లేవ్.. గ్రామాల్లో సర్పంచ్ లు లెక్కచేస్తలేరు: ఎంపీటీసీల ఆవేదన

ఫండ్స్ లేవ్.. అధికారాల్లేవ్.. గ్రామాల్లో సర్పంచ్ లు లెక్కచేస్తలేరు: ఎంపీటీసీల ఆవేదన

ఎంపీటీసీల డిమాండ్లు ఇవీ..

   73వ రాజ్యాంగ సవరణ ద్వారా 29 అధికారాలను స్థానిక సంస్థలకు ఇవ్వాలి.
ఎంపీటీసీలకు ఏటా రూ.10 లక్షల నిధులు ఇవ్వాలి.
స్టేట్ ఫైనాన్స్ కమిషన్ లో సభ్యులుగా నియమించాలి.
గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పెంచాలి
వచ్చే ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యే 15వ ఆర్థిక సంఘం లో ఎంపీటీసీలకు నిధులు ఇవ్వాలి.

 

హైదరాబాద్, వెలుగు‘‘ఎంతో కష్టపడి, ఎంతో ఖర్చు పెట్టి ఎంపీటీసీలుగా గెలిచాం. కానీ నిధులు లేవు. అధికారాలు లేవు. గ్రామాల్లో సర్పంచ్ లు లెక్కచేస్తలేరు. గౌరవం ఇస్తలేరు. మమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నం. సమస్యలు పరిష్కారం కావాలంటే నిధులియ్యాలె. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పార్టీలకతీతంగా ఎంపీటీసీలు అందరూ కలిసి పోరాటం చేస్తం’’ అని ఎంపీటీసీలు స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ చాంబర్ అధ్వర్యంలో హైదరాబాద్​లోని లక్డీకపూల్ లో నిర్వహించిన చైతన్య సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 250 మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. సదస్సులో తమ సమస్యలను ఏకరువు పెట్టారు.

రూ.533 కోట్లు విడుదల చేయాలె

ఎంపీటీసీలకు సంబంధించి 18 డిమాండ్లు ఉన్నాయని, వాటిపై వచ్చే నెలాఖరు వరకు అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి, జిల్లా కలెక్టర్లకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు ఇస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలు చింపుల శైలజ వెల్లడించారు. తర్వాత సీఎం కేసీఆర్ కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మైనింగ్ సివరేజ్ బకాయిలు రూ.533 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిధులను విడుదల చేస్తే ప్రతి ఎంపీటీసీకి అభివృద్ధి చేసేందుకు నిధులు వస్తాయని సత్యనారాయణ రెడ్డి తెలిపారు. బకాయిలు విడుదల చేయాలని హైకోర్టు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

అప్పుడు ఉపయోగించుకుని..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు తమను ఉపయోగించుకుని, క్యాంపులకు తీసుకెళ్లి.. గెలిచిన తర్వాత పట్టించుకోవటం లేదని, నిధులు ఇవ్వటం లేదని ఎంపీటీసీలు వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపీటీసీల వ్యవస్థను నాశనం చేశాయని, నిధులు , అధికారాలు ఇవ్వనపుడు ఈ వ్యవస్థ ఎందుకని, రద్దు చేయండని పలువురు ఆవేశంతో అన్నారు. 30 రోజుల యాక్షన్ ప్లాన్ లో సర్పంచ్ లు ఎంపీటీసీలను పిలవలేదని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో కుర్చీ ఏర్పాటు చేయాలని, జనవరి 26న జాతీయ జెండా ఎగురవేసే అవకాశం ఇవ్వాలని కోరారు. జిల్లా పరిషత్ లో మాదిరే మండల పరిషత్ లో స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేసి ఎంపీటీసీలను ఆ కమిటీలకు చైర్మన్లుగా నియమించాలని డిమాండ్ చేశారు. ఎంపీటీసీల ఇబ్బందులు చూస్తే భవిష్యత్ లో వార్డు మెంబర్లుగా కూడా గెలవరని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఊర్లకు వెళ్లాలంటే భయమవుతోందని చెప్పారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి గడిల కుమార్ గౌడ్, బాదేపల్లి సిద్ధార్థతోపాటు వివిధ జిల్లాల కన్వీనర్లు పాల్గొన్నారు.