సరిహద్దులు చెరిపేసిన డిజిటల్‌‌‌‌ విద్య : గవర్నర్ జిష్ణుదేవ్‌‌‌‌ వర్మ

సరిహద్దులు చెరిపేసిన డిజిటల్‌‌‌‌ విద్య : గవర్నర్ జిష్ణుదేవ్‌‌‌‌ వర్మ
  • ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలంగాణ మూలాలను మరవొద్దు
  • గవర్నర్ జిష్ణుదేవ్‌‌‌‌ వర్మ
  • ఘనంగా శాతవాహన యూనివర్సిటీ రెండో కాన్వొకేషన్‌‌‌‌న్
  • 25 మందికి పీహెచ్‌‌‌‌డీ, 161 మందికి గోల్డ్‌‌‌‌మెడల్స్‌‌‌‌ ప్రదానం

కరీంనగర్, వెలుగు : ‘విద్యా బోధన అంటే బోర్డు, చాక్‌‌‌‌పీస్‌‌‌‌ మాత్రమే కాదు.. ఆ స్థానంలోకి టెక్నాలజీ వచ్చి భౌగోళిక సరిహద్దులు, సామాజిక అడ్డంకులను తొలగించింది’ అని గవర్నర్‌‌‌‌ జిష్ణు దేవ్‌‌‌‌ వర్మ చెప్పారు. స్కిల్స్‌‌‌‌ నేర్చుకోవడం వల్ల స్టూడెంట్లకు కొత్త శక్తి వస్తుందని, అదే విజయానికి దారి తీస్తుందన్నారు. శాతవాహన యూనివర్సిటీ రెండో కాన్వొకేషన్‌‌‌‌ శుక్రవారం స్థానిక స్పోర్ట్స్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో ఘనంగా జరిగింది. 

ఈ కార్యక్రమానికి గవర్నర్‌‌‌‌తో పాటు హైదరాబాద్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ యూనివర్సిటీ వీసీ బి. జగదీశ్వర్‌‌‌‌రావు, శాతవాహన వీసి ఉమేశ్‌‌‌‌కుమార్‌‌‌‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా 25 మందికి పీహెచ్‌‌‌‌పీ పట్టాలు, 161 మందికి గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ అందజేశారు. అనంతరం గవర్నర్ జిష్ణు దేవ్‌‌‌‌ వర్మ మాట్లాడుతూ... యూనివర్సిటీ విద్యార్థులు, పరిశోధకుల ఆవిష్కరణలు, నిబద్ధతపై తెలంగాణ భవిష్యత్‌‌‌‌ ఆధారపడి ఉందన్నారు.

 వికసిత భారత్‌‌‌‌ నిర్మాణానికి స్టూడెంట్లే పునాది కావాలని సూచించారు. శాతవాహన యూనివర్సిటీ గొప్పగా ఎదుగుతోందని, అందరికీ సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య అందించడమే యూనివర్సిటీ లక్ష్యమన్నారు. న్యాక్‌‌‌‌ గుర్తింపు, ఎన్‌‌‌‌ఐఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ ర్యాంకింగ్‌‌‌‌ కోసం కృషి చేయాలని ఆఫీసర్లకు సూచించారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మూలాలను మాత్రం మరవొద్దని, ప్రతి విజయంలో తెలంగాణ మట్టి వాసన పరిమళించాలని ఆకాంక్షించారు. 

‘విద్యార్థులు పైకి ఎగరడానికి విద్య అనేది రెక్కలనిస్తుందని, ఇంకా ఎత్తుకు ఎగరడానికి ధైర్యాన్ని కూడా ఇస్తుంది’ అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సెంట్రల్‌‌‌‌ యూనివర్సిటీ వీసీ జగదీశ్వర్‌‌‌‌రావు మాట్లాడుతూ గ్రామీణ యువతకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి నాణ్యమైన విద్య అందించడం ద్వారా ఈ విశ్వవిద్యాలయం సామాజిక మార్పు, సాధికారితకు మార్గదర్శకంగా నిలిచిందన్నారు. వికసిత భారత్‌‌‌‌2047 లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.