ఇటుకల్ని నేలపై పేర్చే మెషిన్​ తయారీ

ఇటుకల్ని నేలపై పేర్చే మెషిన్​ తయారీ

ఇల్లు కట్టాలంటే.. ఇటుకలు కావాలి. అయితే ఆ ఇటుకలు కోయడానికి, కాల్చడానికి, బట్టీ పేర్చడానికి...చాలామంది కూలీలు అవసరం అవుతారు. ఫలితంగా  కన్​స్ట్రక్షన్​ ఖర్చు పెరిగిపోతోంది. దాన్ని తగ్గించడానికే ఎస్​ఎన్​పిసి ప్రైవేట్​ లిమిటెడ్​ పేరుతో ఆటోమేటెడ్​ ఇటుకల తయారీ మెషిన్​ తయారుచేశాడు 42 ఏండ్ల  సతీష్. ఇతని​కి ఇంజినీరింగ్​ పట్టా లేదు. అలాగని మెషిన్ల తయారీలో ఎలాంటి ఎక్స్​పీరియెన్స్​ లేదు. కానీ, అవసరం ఈ స్కూల్​ డ్రాపవుట్​ని ఈ ఇన్నొవేషన్​​​​​ వైపు నడిపించింది. ఎన్నో ఫెయిల్యూ ర్స్​ని దాటి ఈ మెషిన్​ని మార్కెట్​లోకి తీసుకొచ్చిన ఇతని గురించి.. 

ఇంటికి వెన్నెముక ఇటుకనే. అయితే ఆ ఇటుకల తయారీ చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాన్ని తగ్గించడానికే  ఈ మెషిన్​ తయారుచేశా అంటున్న సతీష్​ హర్యానాలోని సోనేపట్​లో పుట్టి, పెరిగాడు. పదో క్లాస్​ మధ్యలోనే ఆపేసి  తండ్రి ఇటుక బట్టీల్ని చూసుకోవాల్సి వచ్చింది. మొదట్లో అంతా బాగానే ఉన్నా రానురాను కూలీల ఖర్చు బాగా పెరిగింది. దాంతో డిమాండ్​కి తగ్గట్టు ఇటుకల్ని సప్లయ్​ చేయడం కష్టమైంది సతీష్​కి. నష్టాల వల్ల 2010లో ఆ బిజినెస్​ మూసేశాడు. 

కారణాల్ని వెతికాడు

అప్పటికి సతీష్​ వయసు 32 ఏండ్లు. చేతిలో మరో పని లేదు. అయినా కుంగిపోలేదు. తన ఫెయిల్యూర్​కి కారణాల్ని వెతికాడు. వాటిని ఎలా సరిచేసుకోవాలో ఆలోచించాడు. కూలీలు లేకుండా  ఇటుకలు తయారుచేసే మెషిన్​ని తీసుకొస్తే  ఖర్చుతో పాటు టైం​ కలిసొస్తుంది అనుకున్నాడు. కానీ, ఎలా?  అన్నది తెలియలేదు. అలాగని ఆ ఆలోచనని వదిలేయలేదు. చాలామంది ఇంజినీర్లని కలిశాడు. నాలుగేండ్లు రీసెర్చ్​ చేసి, మెషిన్​ ప్రొటో టైప్​ తయారుచేశాడు. ఎక్స్​పర్ట్స్​ సజెషన్స్​తో దానిలోని లోపాల్ని సరిచేసి, టెస్టింగ్​ కోసం ఇటుక బట్టీల్లో పెట్టాడు. ఇటుకల్ని తయారుచేయడం వరకు బాగానే ఉంది. కానీ, తయారైన ఇటుకల్ని  మరోచోట ఎండలో ఆరబెట్టాల్సి వస్తోంది. అప్పుడు పెద్ద సంఖ్యలో కూలీల అవసరం పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటా? అని ఆలోచించాడు సతీష్​. 

కదిలే మెషిన్​ తయారుచేసి..

ఆ సమస్యకి సొల్యూషన్​గా ట్రక్​లా కదులుతూ ఇటుకల్ని నేలపై పేర్చే మెషిన్​ తయారు చేయాలనుకున్నాడు. అందుకోసం స్టీల్​ ఫ్యాక్టరీల్లో పనిచేసే వెల్డర్స్​ని , లోకల్​గా ఉండే మెకానిక్​లని​ కలిశాడు. వాళ్ల సలహాలతో  బ్రిక్​ తయారీ యూనిట్​ ప్రొటో టైప్​ని డిజైన్​ చేశాడు. కొందరు వెండర్స్​ని కలిసి మెషిన్​ తయారీకి కావాల్సిన భాగాల్ని తెప్పించుకున్నాడు. అలా ఏడాది కష్టపడి 2015 లో కదిలే ఇటుకల తయారీ ట్రక్​ని లాంచ్​​​ చేశాడు. మొదట గంటకి తొమ్మిదివేల  ఇటుకల్ని తయారుచేసే చిన్న మెషిన్​ తయారుచేశాడు సతీష్​. ఆ తర్వాత ఇటుకల తయారీ కెపాసిటీని పెంచడానికి మెషిన్​ పనిముట్లని అప్​డేట్​ చేసి మరో రెండు వెర్షన్లని రిలీజ్​ చేశాడు. అవి కూడా సక్సెస్​ అయ్యాయి. కిందటి ఏడాది ‘ కన్​స్ట్రక్షన్​ డెవలప్​మెంట్​ మానిటరింగ్​ సర్వీసెస్​’ కేటగిరిలో  ​ఈ ఇన్నొవేషన్​కి నేషనల్​ స్టార్టప్​ అవార్డు వచ్చింది. 
‘‘ఈ బ్రిక్​ మెషిన్​ ట్రక్కులో  జనరేటర్​ ఉంటుంది. ఇటుకల తయారీ కోసం మట్టిని కలిపేందుకు​​, కలిపిన మట్టిని ఇటుకలుగా వేసే అచ్చు మెషిన్స్​​ ఉంటాయి. దాంతో ట్రక్కులో ఇటుకల తయారీకి కావాల్సిన ముడిసరుకు వేస్తే.. ఇటుకలు తయారవుతాయి. డ్రైవర్​ ఆ ట్రక్కు నడుపుతుంటే మెషిన్​ ఇటుకల్ని అంగుళం గ్యాప్​తో  నేలపై వరుసగా పేర్చుతుంది.  ఒక్కో ట్రక్కు గంటకి 12, 000 ఇటుకల్ని తయారుచేస్తుంది. దీనివల్ల ఇటుకల తయారీ ఖర్చు అరవైశాతం తగ్గుతుంది. ఇప్పటికే 250 మెషిన్లు ఇతర దేశాలకు పంపించాం​. ప్రస్తుతం మెషిన్​ తయారీ యూనిట్​ని మరింత విస్తరించాలనుకుంటున్నాం. ఈ మెషిన్​ తయారీ వెనక మా తమ్ముడు విలాస్​ చికారా  కృషి కూడా చాలా ఉంద’’ని చెప్పాడు సతీష్​.