త్రిపుర పర్యాటకశాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా గంగూలీ.. 

త్రిపుర పర్యాటకశాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా గంగూలీ.. 

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ.. ఈశాన్య రాష్ట్రం త్రిపుర పర్యాటక శాఖకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా ప్రకటించారు.

త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత చౌధరీ మంగళవారం (మే 23న) కోల్‌కతాలోని గంగూలీ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. అటు సీఎం మాణిక్‌ సాహా కూడా గంగూలీతో ఫోన్‌లో మాట్లాడారు.  బ్రాండ్ అంబాసిడర్‌ బాధ్యతలను ఆఫర్‌ చేశారు.

సౌరభ్‌ గంగూలీ తమ ప్రతిపాదనను అంగీకరించి... త్రిపుర టూరిజానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాధ్యతలు చేపడుతుండటం తమకు గర్వకారణంగా ఉందని  సీఎం సాహా ట్విటర్‌లో తెలిపారు. గంగూలీ రాకతో తమ రాష్ట్ర పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతున్నట్లు భావిస్తున్నామన్నారు. 

ఈ ప్రకటనతో దాదా రాజకీయ అరంగేట్రంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం త్రిపురలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ రాష్ట్ర పర్యాటక శాఖకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా గంగూలీ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు రాగానే.. పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. దీంతో దాదా బీజేపీలో చేరుతారని మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ మధ్య పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం గంగూలీకి జెడ్‌ కేటగిరీ భద్రతను కేటాయించడంతో ఆయన టీఎంసీ పార్టీకి దగ్గరవుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే త్రిపుర పర్యాటక శాఖకు ఆయనను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించడంపై మళ్లీ చర్చ మొదలైంది.