కోల్‌బెల్ట్/కొత్తగూడెం, వెలుగు : ‘సేవ్ సింగరేణి’ పేరుతో సంస్థ పరిధిలోని అన్ని గనులు, డిపార్ట్‌మెంట్ల వద్ద మంగళవారం కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే నెలలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
కొత్తగూడెంలో పలువురు యూనియన్ నేతలు మాట్లాడుతూ... స్ట్రక్చర్ మీటింగ్‌లో అగ్రిమెంట్ చేసుకున్న సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 18 నుంచి 30 వరకు గోలేటి నుంచి కొత్తగూడెం వరకు బస్సు యాత్రను చేపట్టనున్నట్టు ప్రకటించారు. 30న కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం పలువురు ఆఫీసర్లకు వినతిపత్రాలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముష్కే సమ్మయ్య, అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, నేతలు సలెంద్ర సత్యనారాయణ, భీమనాధుని సుదర్శనం పాల్గొన్నారు.
