
న్యూఢిల్లీ: మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉంటున్న కృష్ణ మీనన్ మార్గ్‌లోని అధికారిక నివాసం నుంచి ఆయనను ఖాళీ చేయించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ లేఖ రాసింది. కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖకు జులై 1న ఈ లేఖ రాసింది. 2022 నిబంధనల ప్రకారం, మాజీ సీజేఐలు రిటైర్మెంట్ తర్వాత ఆరు నెలల వరకు మాత్రమే అధికారిక నివాసంలో ఉండేందు అవకాశం ఉంది. అయితే, చంద్రచూడ్, 2024 నవంబర్‌లో రిటైర్ అయినప్పటికీ, ఎనిమిది నెలలుగా ఈ నివాసంలోనే ఉంటున్నారు.
తన కుమార్తెల ప్రత్యేక అవసరాల కారణంగా తుగ్లక్ రోడ్‌లోని కొత్త నివాసంలో సర్దుబాటు కోసం సమయం కావాలని జస్టిస్ చంద్రచూడ్ కోరారు. మే 31, 2025 వరకు ఆయనకు అనుమతి ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత కూడా ఆయన ఖాళీ చేయలేదు. అయితే ఈ నివాసం ప్రస్తుత సీజేఐ కోసం కేటాయించారు. ఆయన ఖాళీ చేయకపోవడంతో ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్, మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా ఇతర నివాసాల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను తక్షణమే నివాసం ఖాళీ చేయించాల్సిందిగా కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది.