దళితులపై వివక్ష పోవట్లే.. ప్రజా సంఘాలకు బాధలు చెప్పుకున్న బాధితులు

దళితులపై వివక్ష పోవట్లే.. ప్రజా సంఘాలకు బాధలు చెప్పుకున్న బాధితులు

ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీగా పుట్టిన పాపానికి తమపై దాడులు, వివక్ష కొనసాగుతూనే ఉన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయ ప్రజా ఉద్యమాల వేదిక, దళిత బహుజన ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజా బహిరంగ విచారణ నిర్వహించారు. 

ఈ విచారణకు రిటైర్డ్ జడ్జి నిమ్మ నారాయణ, ప్రొఫెసర్లు లక్ష్మీనారాయణ, సూరెపల్లి సుజాత, రమా మేల్కోటే, కల్పన కన్నాబిరన్, న్యాయవాదులు దర్శనం నరసింహ, వి.రఘునాథ్‌తో పాటు పలు ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలోని 30 జిల్లాల నుంచి వచ్చిన బాధితులు తమ బాధలు చెప్పుకున్నారు. నేటికీ తెలంగాణలో దళితులు సామాజిక బహిష్కరణలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఓటు వేయలేదని ఇల్లు కూల్చివేశారని సంగారెడ్డి జిల్లాకు చెందిన రాములు వాపోయారు. 

పట్టాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని మంచిర్యాలకు చెందిన పోషవ్వ తెలిపారు. దాడులపై కేసులు నమోదు చేయకపోవడం, నిందితుల అరెస్టుల్లో నిర్లక్ష్యం, నష్టపరిహారం, పునరావాసంలో వివక్ష కొనసాగుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. దాడులను అరికట్టేందుకు సీఎం అధ్యక్షతన హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.