అద్దంకి దయాకర్ జోలికొస్తే ఎవరినీ వదలం

అద్దంకి దయాకర్ జోలికొస్తే ఎవరినీ వదలం
  • కాంగ్రెస్​లో రెడ్లకో న్యాయం బహుజనులకో న్యాయమా?
  • అద్దంకి దయాకర్ పై కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మాటలు సహించం
  • జాతీయ మాల మహానాడు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు

ఖైరతాబాద్, వెలుగు: కాంగ్రెస్​పార్టీలో రెడ్డిలకు ఒక న్యాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకో న్యాయమా అని -జాతీయ మాల మహానాడు, బీసీ సంక్షేమ సంఘాల నాయకులు ప్రశ్నించారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ క్షమాపణలు చెప్పినప్పటికీ.. దళితుడనే అక్కసుతో చెంపలు వాయించాలే, పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు దళితులను అవమానించేలా ఉన్నాయన్నారు.

మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో మాలమహానాడు జాతీయ కార్యదర్శి బైరి రమేశ్ అధ్యక్షతన ప్రెస్​మీట్​పెట్టారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే అద్దంకి దయాకర్ కు ఎందుకు షోకాజ్​నోటీసులు పంపుతున్నారని మండిపడ్డారు. రెడ్డిలు.. రెడ్డిలు తిట్టుకున్నా, రెడ్డిలు కింది కులాల వారిని తిట్టినా, కొట్టినా నోటీసులు ఇవ్వక పోవడం దుర్మార్గం అన్నారు. తెలంగాణ ఇచ్చిన కృతజ్ఞతతో కాంగ్రెస్​లో పనిచేస్తుంటే పొమ్మనలేక పొగ పెట్టినట్లు ఉద్యమకారులకు అవమానం జరుగుతోందన్నారు. ఆత్మగౌరవం లేనిచోట ఉండొద్దని దయాకర్​కు సూచించారు.

వెంకట్​రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. ఉద్యమనేత అద్దంకి దయాకర్ జోలికొస్తే ఎవరినీ వదలమని హెచ్చరించారు. సమావేశంలో అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు గుడిమల్ల వినోద్ కుమార్, నాయకులు లింగస్వామి, రామ్ కుమార్, ప్రదీప్, మల్లేష్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.