- అటెండ్ కానున్న 10 శాఖల ఉన్నతాధికారులు
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి అత్యున్నత నిర్ణాయక మండలి అయిన బోర్డ్ ఆఫ్ గవర్నింగ్ కౌన్సిల్ (బీజీసీ) మీటింగ్ ఈ నెల 28న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020లో చివరిసారిగా ఈ సమావేశం జరిగింది. సుదీర్ఘ విరామం తర్వాత సుమారు ఆరేండ్లకు తిరిగి భేటీ జరుగుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ మీటింగ్‌కు ముందు ఈ నెల 21న సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి చైర్మన్‌గా వ్యవహరించే ఈ సమావేశంలో చర్చించాల్సిన ప్రధాన అంశాలు, ఎజెండాపై అధికారులు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. ఈ మీటింగ్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎడ్యుకేషన్, ఫైనాన్స్‌తో పాటు మరి కొన్ని శాఖల స్పెషల్ సీఎస్‌లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అటెండ్ కానున్నారు. ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్, కోర్టు కేసులు, ప్రమోషన్లు, రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ఖర్చు, అమలవుతున్న స్కీమ్‌లు, వాటి పనితీరుపై చర్చించి కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది.

