హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారంపై పిల్​.. పిటిషనర్​కు రూ.5 లక్షల ఫైన్

హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారంపై పిల్​.. పిటిషనర్​కు రూ.5 లక్షల ఫైన్

న్యూఢిల్లీ: బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ బాధ్యతలు చేపట్టే సమయంలో చేసిన ప్రమాణం సరిగా లేదని పిల్ ​వేసిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు ఊహించని షాక్​ ఇచ్చింది. పనికిమాలిన అంశాలపై పిల్స్​ వేస్తూ కోర్టు సమయాన్ని వృథా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బెంచ్..​పిటిషనర్​కు రూ.5 లక్షల జరిమానా విధించింది. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం సరిగా జరగలేదని, రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్‌కు విరుద్ధంగా చేశారని లక్నోకు చెందిన అశోక్​ పాండే అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్​ వేశారు.

 ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ప్రధాన న్యాయమూర్తి తన పేరు ముందు ‘నేను’ అనే పదాన్ని ఉపయోగించలేదని, కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ, దాద్రా నగర్​హవేలీ ప్రభుత్వ ప్రతినిధులను ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించలేదని అశోక్​పాండే పిటిషన్​లో పేర్కొన్నారు. ఆ పిల్​ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్ ​నేతృత్వంలోని బెంచ్​శనివారం విచారణ చేపట్టింది.

 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో గవర్నర్ ​ప్రమాణ స్వీకారం చేయించారని, దానిపై అభ్యంతరాలు లేవనెత్తడానికి ఏమీ లేదని, ఇది పిటిషనర్​ప్రచారం పొందడానికి చేసిన పనికిమాలిన ప్రయత్నమేనని కోర్టు పేర్కొంది. కోర్టు సమయం వృథా చేసినందుకు పిటిషనర్​కు రూ.5 లక్షల జరిమానా విధిస్తున్నట్లు చెప్పింది. ఆ మొత్తాన్ని పిటిషనర్​ నెల రోజుల్లో కోర్టు రిజిస్ట్రీలో డిపాజిట్​చేయాలని బెంచ్ ​తీర్పునిచ్చింది. ఒక వేళ జమచేయకుంటే.. లక్నో కలెక్టర్​ ద్వారా అతని వద్ద నుంచి భూ ఆదాయ బకాయిలుగా వసూలు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది.