వీధికుక్కల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. ప్రజలను కుక్కలు కరిస్తే పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. ప్రతీ కుక్క కాటుకు రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. వీధికుక్కలకు ఆహారం పెట్టేవారిపై కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం వార్నింగ్ ఇచ్చింది. కుక్కలకు ఆహారం ఇచ్చేవారు ... వాటిని వారి ఇంట్లో పెంచుకోవాలని, కుక్కకాటుకు వారే బాధ్యత వహించాలని చెప్పింది.
వీధి కుక్కల సంక్షేమం, నియంత్రణపై గత కొద్దిరోజులుగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా , జస్టిస్ ఎన్వి అంజరియా నేతృత్వంలోని ధర్మాసనం.. మంగళవారం(జవనరి 13) జరిగిన విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా కుక్కకాటుకు బలి అవుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.. ఇకపై ప్రతికుక్క కాటుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ప్రతి కుక్కకాటుకు భారీ ఫైన్ చెల్లించేలా తాము నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది.
మరోవైపు వీధికుక్కలకు ఆహారం అందించే వారు కూడా బాధ్యులవుతారని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కుక్కలకు ఫీడ్ ఇచ్చేవారు వాటిని వారి ఇండ్లలో పెంచుకోవచ్చన్నారు. కుక్కకాటు కు వీరు కూడా బాధ్యులే అవుతారని తెలిపింది.
గత వారంలో మూడు రోజులుగా వీధి కుక్కల సంక్షేమం, నియంత్రణపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. బహిరంగ ప్రదేశాల్లో వీధికుక్కలు ఉనికిని పరిశీలించింది. వీధి కుక్కల నిర్వహణలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమైనట్లు గుర్తించింది. ABC నిబంధనల అమలు సరిగా లేదని పేర్కొంది. వీధికుక్కలను తాము ఎప్పుడు తొలగించాలని ఆదేశించలేదని .. అవి కేవలం వన్యప్రాణులకు హానీ చేస్తాయని మాత్రమే హెచ్చరించామని కోర్టు స్పష్టం చేసింది.
