
సైబర్ కేటుగాళ్లు రూటు మార్చారు.. సీబీఐ, సీఐడీ, ఢిల్లీ పోలీసుల విచారణ అంటే ఎవరూ నమ్మటం లేదు అనుకున్నారో ఏమో.. ఏకంగా సుప్రీంకోర్టు సెట్టింగ్ వేశారు.. దొంగలే జడ్జీల అవతారం ఎత్తారు.. ఇది సుప్రీంకోర్టు.. ఇతను సుప్రీంకోర్టు జడ్జి అంటూ లైవ్ లో చూపించారు.. హైదరాబాద్ సిటీకి చెందిన రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ కు కాల్ చేశారు.. అతని చిట్టా విప్పారు.. ఇంకేముందీ వణికిపోయిన ఆ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్.. నిజమే అనుకుని.. వాళ్లు చెప్పిన అకౌంట్ కు కోటిన్న రూపాయలు.. అక్షరాల కోటి 50 లక్షల రూపాయలు పంపాడు.. డబ్బులు వాళ్లకు చేరాయి.. లైవ్ కట్ అయ్యింది.. సీన్ కట్ చేస్తే అంతా మోసం.. దగా అని తేసింది.. సైబర్ నేరగాళ్లు అని క్లారిటీ వచ్చింది. దేశాన్ని కుదిపేస్తున్న సైబర్ నేరగాళ్ల నయా దందా హైదరాబాద్ కేంద్రంగా వెలుగులోకి రావటం సంచలనంగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లో జరిగిన ఈ భారీ స్కాం గురించి వింటే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.. సుప్రీంకోర్టు జస్టిస్ పేరు చెప్పి రిటైర్డ్ ఇంజనీర్ నుంచి ఏకంగా రూ. కోటి 50 లక్షలు కొల్లగొట్టారు కేటుగాళ్లు. నకిలీ కోర్టు సృష్టించి... నకిలీ జడ్జిని ప్రవేశపెట్టి పక్కా ప్లాన్ తో వనస్థలిపురంలోని మాజీ చీఫ్ ఇంజనీర్ నుంచి కోటిన్నర కొట్టేసారు నేరగాళ్లు.ఒక కేసులో మీ పేరు వచ్చిందని భయపెట్టి.. కేసుకు సంబంధించి విచారణ సుప్రీంకోర్టులో జరుగుతుందని చెప్పి నమ్మించారు కేటుగాళ్లు.జస్టిస్ కేసుని స్వయంగా విచారిస్తున్నారని చెప్పి, వీడియో కాల్ కనెక్ట్ అవ్వాలని చెప్పారు.
ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే నకిలీ జడ్జి వీడియో కాల్ లోకి వచ్చి కేసు తీవ్రంగా ఉందని.. అరెస్టు చేయాల్సి ఉంటుందని హెచ్చరించాడు నకిలీ జడ్జి. కేసు విషయమై డబ్బులను సుప్రీంకోర్టు అకౌంట్లో జమ చేయాలని.. మీ డబ్బులు కేసు అయిపోగానే తిరిగి వస్తాయంటూ చెప్పి నమ్మించారు.
నకిలీ జడ్జ్ చెప్పిన మాటలు నమ్మిన బాధితుడు కోటి 50 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశాడు. డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.