బండి భగీరథ్ పోక్సో కేసులో పోలీసుల దూకుడు.. అరణ్య ఫామ్‎హౌస్‎లో సీన్ రీకన్‎స్ట్రక్షన్

బండి భగీరథ్ పోక్సో కేసులో పోలీసుల దూకుడు.. అరణ్య ఫామ్‎హౌస్‎లో సీన్ రీకన్‎స్ట్రక్షన్

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసులో పోలీసులు దూకుడు పెంచారు. కోర్టు అనుమతితో బుధవారం (మే 27) భగీరథ్‎ను కస్టడీలోకి తీసుకున్న పేట్ బషీర్‎బాద్ పోలీసులు ఎంక్వైరీ ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా భగీరథ్‎ను మొయినాబాద్‌లోని అరణ్య ఫామ్ హౌస్‎కు తీసుకువెళ్లి సీన్ రీ కన్‎స్ట్రక్షన్ నిర్వహించారు పోలీసులు. అనంతరం కూకట్‎పల్లి డీసీపీ కార్యాలయంలో ప్రశ్నించారు. విచారణ తర్వాత అక్కడి నుంచి నిందితుడిని పేట్ బషీర్‎బాద్ పోలీస్ స్టేషన్‎కు తరలించారు. 

మూడు రోజుల పోలీస్ కస్టడీ

మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిచడంతో పాటు.. అత్యాచారం చేశాడనే ఆరోపణలతో బండి భగీరథ్‎ను 2026, మే 16 రాత్రి పేట్ బషీర్‏బాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు రిమాండ్కు తరలించడంతో నిందితున్ని పూర్తి స్థాయిలో విచారించే అవకాశం లేకుండా పోయిందని, మరిన్ని ఆధారాలు సేకరించేందుకు వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించాలని కోరుతూ.. పేట్బషీరాబాద్ పోలీసులు న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.

కాగా.. తన క్లయింట్‎పై వస్తున్న ఆరోపణలు నిజం కాదని, కుట్రపూరితంగా చేశారని బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ తరఫున అడ్వకేట్స్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై మంగళవారం వాదనలు విన్న మేడ్చల్ జిల్లా న్యాయస్థానం పోలీసుల వాదనతో ఏకీభవించింది. బండి భగీరథ్ను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బుధవారం (మే 27) భగీరథ్‎ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. ఈ కేసుకు సంబంధించిన మరిన్నీ వివరాలు రాబట్టేందుకు దర్యాప్తు చేపట్టారు.