ఉదయమే ఇళ్లల్లో సందడి మొదలైంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ముస్తాబు చేసి, కొత్త బుక్స్, బ్యాగ్స్, కలర్‌ఫుల్ లంచ్ బాక్సులతో స్కూళ్లకు సాగనంపారు. కొందరు పేరెంట్స్ స్వయంగా పిల్లలను స్కూల్ దగ్గర డ్రాప్ చేయగా.. మరికొందరు ఆటోలు, వ్యాన్లు, బస్సుల్లో పాఠశాలలకు చేరుకున్నారు. వేసవి సెలవులను ఫుల్‌గా ఎంజాయ్ చేశామని, మళ్లీ ఫ్రెండ్స్‌ను కలవడం, చదువుకోవడం చాలా హ్యాపీగా ఉందంటూ విద్యార్థులు మురిసిపోతున్నారు.
అయితే, 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి రోజైన నేడు.. దాదాపు అన్ని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగా నమోదైంది. దీనికి కారణం లేకపోలేదు! ఈరోజు తొలిరోజు కావడంతో పాటు అమావాస్య రావడం.. చాలామంది తల్లిదండ్రులు సెంటిమెంట్‌గా భావించి పిల్లలను బడికి పంపించలేదు. ప్రైవేట్ స్కూల్స్ సైతం ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ.. ఇవాళ అమావాస్య, రేపు మంగళవారం కావడంతో, డైరెక్ట్‌గా బుధవారం నుంచే క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించాయి.
ఇక తొలిరోజు బడికి వచ్చిన పిల్లల కోసం కొన్ని స్కూల్స్ వెరైటీగా వెల్కమ్ ట్రీట్ ఇచ్చాయి. ప్రత్యేకంగా వెల్కమ్ బోర్డులు ఏర్పాటు చేసి.. లోపలికి వచ్చే విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు, పెన్నులు గిఫ్ట్‌లుగా ఇస్తూ గ్రాండ్‌గా స్వాగతం పలికాయి. ఏదేమైనా.. మళ్లీ స్కూల్ బెల్ మోగడంతో బళ్లన్నీ పిల్లల కేరింతలతో కళకళలాడుతున్నాయి.
