ఐఐసీటీలో సైన్స్​ ఎక్స్​పీరియన్స్ సెంటర్

ఐఐసీటీలో సైన్స్​ ఎక్స్​పీరియన్స్ సెంటర్
  • భూమిపూజ చేసిన కేంద్రమంత్రులు జితేంద్ర సింగ్, కిషన్​రెడ్డి 
  • సైన్స్​సిటీ ఏర్పాటుకు గత సర్కార్ భూమి ఇయ్యలేదన్న కిషన్​రెడ్డి
  • ప్రస్తుత ప్రభుత్వమైనా భూమి ఇవ్వాల నిసూచన

సికింద్రాబాద్, వెలుగు : ఒక దేశ సంస్కృతికి విజ్ఞాన శాస్త్రానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుందని.. సైన్స్, కల్చర్ లేకుండా పూర్తిగా అభివృద్ధిని సాధించలేమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో వీటిని పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. తార్నాకలోని ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో ఏర్పాటు చేయనున్న సైన్స్ ఎక్స్​పీరియన్స్ సెంటర్ కు ఆయన కేంద్రమంత్రి కిషన్​రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ శాస్త్రీయ ఆలోచనలు చేసేలా సమాజంలో అవగాహన కల్పించాలని తెలిపారు.

‘‘ఫార్మా రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్లస్టర్ గా మారింది. రిసెర్చ్​ అండ్ డెవలప్​మెంట్ రంగంపై దృష్టి పెట్టే ఫార్మా పరిశ్రమల కోసం ఈ క్లస్టర్​ను ప్రభుత్వం నేషనల్ ఇన్​వెస్ట్​మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ గా గుర్తించింది” అని అన్నారు. సైన్స్ ఎక్స్​పీరియన్స్ సెంటర్ ప్రధానంగా సమాజంలో సైన్స్ కల్చర్​ను వ్యాప్తి చేయడంలో సహకరిస్తుందని చెప్పారు.

ప్రత్యేకంగా స్టూడెంట్లలో ‘కమ్యూని కేటింగ్ సైన్స్ టు ఎంపవర్ పీపుల్’ అనే నినాదంతో ఇన్నోవేషన్స్, ఇంటరాక్టివ్ సైన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్​లు నిర్వహించడంలో దోహదపడుతుందన్నారు. స్టార్టప్​ల కోసం కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే వారిని ప్రోత్సహిస్తుందని చెప్పారు.

400 కోట్లతో సెంటర్​

యువతలో ఇన్నొవేటివ్ సైన్స్​ అండ్ టెక్నాలజీ ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. హైదరాబాద్​లో సైన్స్ సిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందని.. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైన జాగా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందన్నారు. రూ.400 కోట్ల నిధులతో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐఐసీటీ లోనే ప్రస్తుతం సైన్స్ ఎక్స్​పీరియన్స్ సెంటర్​ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

వచ్చే సంవత్సరం సైన్స్ ఎక్స్​పీరియన్స్ సెంటర్ మొదటి దశ పూర్తవుతుందని చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమైనా దీనికి అవసరమైన భూమి నికేటాయిస్తే భవిష్యత్తులో ఈ సెంటర్ సైన్స్ సిటీగా రూపుదిద్దుకుంటుందన్నారు. కార్యక్రమంలో డీఆర్ డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ సతీశ్ రెడ్డి, సీఎస్​ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కలై సెల్వీ, ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్​ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.