హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండున్న ఎగుమతి అనుకూల వరి రకాల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు సూచించారు. సోమవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. దీనికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అగ్రికల్చర్ వర్సిటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు రైతులకు అధిక లాభాలు అందించే 8 మేలురకం వరి వంగడాల సాగును ప్రోత్సహించాలని కేబినెట్ సబ్ కమిటీకి సూచించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న బీపీటీ–5204, తెలంగాణ సోనా, కేఎన్‌ఎం–1638, జై శ్రీరామ్, హెచ్‌ఎంటీ, డబ్ల్యూజీఎల్–962, డబ్ల్యూజీఎల్–44, జేజీఎల్–1798 వరి వంగడాల సాగును ప్రోత్సహించాలని స్పష్టం చేశారు.
అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో తెలంగాణ బియ్యానికి పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో.. ఈ 8 రకాలకు చెందిన వరి సాగు వల్ల రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే ఎక్కువ లాభాలు వస్తాయని, విత్తనాల కొరత కూడా లేదని వెల్లడించారు. అలాగే, ప్రస్తుతం రాష్ట్రంలో సాగు చేస్తున్న అన్ని రకాల సన్న బియ్యానికి మార్కెట్‌లో సమాన ఆదరణ లభించడం లేదని కమిటీ దృష్టికి సివిల్ సప్లై అధికారులు తెచ్చారు.
కొన్ని రకాలు మిల్లింగ్ సమయంలో విరిగిపోతుండటంతో మిల్లర్లు, వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదన్నారు. భవిష్యత్తులో వినియోగదారులు, ఎగుమతులకు అనుకూలమైన నాణ్యమైన వరి రకాలను మాత్రమే ప్రోత్సహించాలన్నారు. దీనివల్ల మిల్లర్లే నేరుగా రైతుల వద్దకు వచ్చి మంచి ధరలకు కొనుగోలు చేస్తారని తెలిపారు. మార్కెట్ డిమాండ్ ఆధారిత పంటల సాగుతోనే రైతులకు నష్టాలు తలెత్తవని పేర్కొన్నారు.
సమావేశంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, అగ్రికల్చర్సెక్రటరీ సురేందర్ మోహన్, డైరెక్టర్ గోపీ, మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్‌రాజ్, సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలకు హార్టికల్చర్ స్పెషల్ బులెటిన్
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు హార్టికల్చర్ పంటల సాగులో అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ పంటల నిర్వహణకు రూపొందించిన ఒక స్పెషల్ బులెటిన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం రిలీజ్ చేశారు. ఉద్యాన విశ్వవిద్యాలయం తయారు చేసిన ఈ బులెటిన్‌ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల పంటలకు కలిగే నష్టాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రైతులకు సలహాలు, సూచనలు అందించాలని అధికారులను, వర్సిటీ వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డిని ఆదేశించారు. ఈ బులెటిన్‌లోని అంశాలు ప్రతి రైతుకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌లో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, వర్సిటీ వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి, హార్టీకల్చర్ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాష తదితరులు పాల్గొన్నారు.
