
హైదరాబాద్‌సిటీ, వెలుగు: దసరా, దీపావళి, ఛత్‌పూజ పండుగల సందర్భంగా నెల రోజుల్లో దేశవ్యాప్తంగా 12 వేల ప్రత్యేక రైళ్లను నడిపినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవతెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో రెగ్యులర్ సర్వీసులతోపాటు 973 ప్రత్యేక రైళ్లను నడిపామన్నారు. 4.80 కోట్ల మంది ప్యాసింజర్లు రెగ్యులర్, ప్రత్యేక రైళ్లను వినియోగించుకున్నట్లు తెలిపారు.
రెగ్యులర్ సర్వీసుల్లోనూ 237 అదనపు కోచ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. లింగంపల్లి, హైటెక్‌సిటీ, చర్లపల్లి, మల్కాజిగిరి వంటి స్టేషన్లలో అదనపు స్టాప్‌లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సికింద్రాబాద్, చర్లపల్లి, హైదరాబాద్, లింగంపల్లి, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, రాయిచూర్, గుంటూరు, నల్గొండ, కాచిగూడ, నిజామాబాద్, నాందేడ్, ఔరంగాబాద్, అకోలా, పూర్ణ వంటి 26 స్టేషన్లలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని లైటింగ్, తాగునీటి సౌకర్యం, క్లీన్ టాయిలెట్స్ సదుపాయాలను కల్పించామని చెప్పారు. సికింద్రాబాద్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు తదితర స్టేషన్లలో అదనపు బుకింగ్కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు.
అన్ని స్టేషన్లలో కేటరింగ్ సర్వీసులను ఐఆర్సీటీసీ సమన్వయంతో అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసి, ఆధునీకరణ పనులను పరిశీలించారు. ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలు, భద్రత చర్యలపై ఆరా తీశారు.