జీడిమెట్ల/ ఓల్డ్‌సిటీ, వెలుగు: సిటీలో మంగళవారం రెండు చోట్ల భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. ఒకచోట కెమికల్ డ్రమ్ములు పేలి భయంతో జనం పరుగులు తీయగా, మరోచోట ఫర్నిచర్ వర్క్‌షాప్ కాలిబూడిదై రూ. 10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.
సూరారం ఇండస్ట్రియల్ ఏరియాలో అనిల్ అనే వ్యక్తికి చెందిన స్క్రాప్ దుకాణంలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుకాణంలో ఉన్న కెమికల్ డ్రమ్ములు మంటల ధాటికి భారీ శబ్దంతో పేలడంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. స్క్రాప్ పేరుతో షాపులో అక్రమంగా కెమికల్ దందా చేస్తున్నారని, ఎండ వేడికి కెమికల్ రియాక్షన్ జరగడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు.
షార్ట్ సర్క్యూట్‌తో మంటలు
పాతబస్తీ కిషన్ బాగ్‌లోని అన్మోల్ పాషా ఫర్నిచర్ సోఫా వర్క్‌షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా గోడౌన్ విభాగంలో మంటలు అంటుకుని ఫర్నిచర్ అంతా కాలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. చందులాల్ బారాదరి, రాజేంద్రనగర్ ఫైర్ సిబ్బందితో పాటు హైడ్రా బృందాలు రంగంలోకి దిగి మంటలను ఆర్పారు. ఈ ఘటనపై బహదూర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

