న్యూఢిల్లీ: నియోలైట్ జేకేడబ్ల్యూ లైటింగ్స్, ఆస్ప్రి స్పిరిట్స్, ఎస్‌ఎస్ రిటైల్ కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా నిధులు సేకరించేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి అనుమతులు పొందాయి. ఈ మూడు కంపెనీలు డిసెంబర్ 2025లో తమ ఐపీఓ పేపర్లను సబ్మిట్ చేశాయి.
నియోలైట్ జేకేడబ్ల్యూ లైటింగ్స్: ఆటోమోటివ్ లైటింగ్ ప్రొడక్ట్‌లను ఈ కంపెనీ తయారు చేస్తోంది. ఇది రూ.600 కోట్లను ఐపీఓ ద్వారా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.400 కోట్ల విలువైన కొత్త షేర్ల జారీ, రూ.200 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ఉన్నాయి. కంపెనీ ఈ నిధులను తమిళనాడులోని కాంచీపురంలో కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి, ప్లాంట్ అండ్ మెషినరీ కొనుగోలుకు, అప్పుల చెల్లింపునకు ఉపయోగించనుంది.
ఆస్ప్రి స్పిరిట్స్: ముంబైకి చెందిన ఈ ఆల్కో-బెవరేజ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కొత్త షేర్ల జారీ ద్వారా రూ.140 కోట్లు సేకరించనుంది. అలాగే ప్రమోటర్లు 50 లక్షల షేర్లను విక్రయిస్తారు. ఈ నిధులలో రూ.105 కోట్లను అప్పుల చెల్లింపునకు కేటాయించనున్నారు.
ఎస్‌ఎస్ రిటైల్: ఈ మల్టీ-బ్రాండ్ రిటైల్ చెయిన్ సంస్థ రూ.500 కోట్లను ఐపీఓ ద్వారా సేకరించాలని చూస్తోంది. ఇందులో రూ.300 కోట్ల కొత్త షేర్లు, రూ.200 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి. ఈ నిధులను కొత్త స్టోర్ల ఏర్పాటుకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు ఉపయోగించనుంది.
