రేషన్ డీలర్లూ అర్హులే .. స్థానిక ఎన్నికలపై ఎస్‌‌‌‌ఈసీ గైడ్‌‌‌‌లైన్స్

రేషన్ డీలర్లూ అర్హులే .. స్థానిక ఎన్నికలపై  ఎస్‌‌‌‌ఈసీ గైడ్‌‌‌‌లైన్స్
  •     జడ్పీటీసీ అభ్యర్థి ఖర్చు లిమిట్ రూ.2.50 లక్షలు, ఎంపీటీసీకి రూ.1.50 లక్షలు 
  •     సర్పంచ్‌‌‌‌కు జనాభాను బట్టి రూ.2.50 లక్షలు,  రూ.1.50 లక్షలు 

హైదరాబాద్, వెలుగు: స్థానిక ఎన్నికల ప్రక్రియ స్పీడప్​అయింది. సర్పంచ్, వార్డు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల అర్హతలు, నామినేషన్, డిపాజిట్, వ్యయ పరిమితులపై రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్‌‌‌‌లైన్స్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రేషన్ డీలర్లు పోటీ చేయవచ్చు. నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి  21 సంవత్సరాలు నిండినోళ్లు అర్హులు. పోటీ చేసే గ్రామం, స్థానిక నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. గ్రామ సేవకులు, అంగన్వాడీ కార్యకర్తలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎయిడెడ్ సంస్థలు, స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పోటీకి అనర్హులు. మతసంబంధమైన సంస్థల చైర్మన్లు, సభ్యులకు అవకాశం లేదు.  సింగరేణి, ఆర్టీసీలో మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్ లేదా సెక్రటరీ హోదాలో పనిచేసే వారు కాకుండా ఇతర ఉద్యోగులు పోటీ చేయడానికి అర్హులు. క్రిమినల్ కోర్టులో కొన్ని నేరాలకు శిక్ష పడిన వ్యక్తి.. శిక్ష విధించిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎన్నికకు అనర్హుడవుతాడు. పౌరహక్కుల పరిరక్షణ చట్టం-1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడినవారు పోటీకి అనర్హులు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌‌‌‌లలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్నా (గుత్తేదారులు) పోటీకి అర్హత ఉండదు. 

అభ్యర్థుల ఎన్నికల ఖర్చెంతంటే? 

అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను ఎస్‌‌‌‌ఈసీ నిర్ధారించింది. జడ్పీటీసీ అభ్యర్థి రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థి రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. ఇక 5 వేల కంటే జనాభా ఎక్కువున్న పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి రూ.2.5 లక్షలు, 5 వేల కంటే తక్కువుంటే రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. అలాగే 5 వేల కంటే జనాభా ఎక్కువున్న పంచాయతీలో వార్డు సభ్యుడు రూ.50 వేలు, 5 వేల కంటే తక్కువుంటే రూ.30 వేల వరకు ఖర్చు చేయవచ్చు. అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాల కోసం తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా వివరాలను అందించాలి. ఖర్చుల నివేదికను సమర్పించాలి. అంతేకాకుండా, అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు తమ అర్హతలు, అనర్హతలు, క్రిమినల్ చరిత్ర, ఆస్తులు, అప్పులు విద్యా వివరాలపై సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఇందులో ఏదీ లేకపోయినా నామినేషన్ తిరస్కరిస్తారు. అఫిడవిట్‌‌‌‌లో తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవు 

డిపాజిట్ తప్పనిసరి.. 

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ కేటగిరీని బట్టి బ్యాంకు డిపాజిట్‌‌‌‌ చేయాలి. జడ్పీటీసీ పదవికి పోటీచేసే అభ్యర్థి (జనరల్​) రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు రూ. 2,500 డిపాజిట్​చేయాలి. ఎంపీటీసీగా చేసేవారు రూ.2,500 (జనరల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.1,250, సర్పంచ్​అభ్యర్థి రూ.2 వేలు (జనరల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.వెయ్యి, వార్డు సభ్యుడికి రూ.500 (జనరల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.250. పోటీచేసే అభ్యర్థులు పంచాయతీల పన్ను బకాయిలు, కరెంట్​ బిల్లులు కూడా క్లియర్​ చేసి ఆ రసీదులు తీసుకోవాలి.  అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికెట్స్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.  

పోలింగ్‌‌‌‌కు 48 గంటల ముందే ప్రచారం బంద్.. 

ఎన్నికలకు నోటిఫికేషన్‌‌‌‌ విడుదలైన రోజు నుంచి మూడు రోజుల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనున్నది. ఇక ఉపసంహరణలు పూర్తయ్యాక పోటీలో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి వారం రోజుల సమయమే కేటాయించారు. పోలింగ్‌‌‌‌ ముగియడానికి నిర్ణయించిన సమయానికి 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం చేయడానికి అవకాశం లేదు. రాతపూర్వక అనుమతి లేకుండా లౌడ్‌‌‌‌ స్పీకర్లు వాడకూడదు. సమావేశాలు, ర్యాలీలు, ఇతర ప్రదేశాల్లో మీటింగ్‌‌‌‌ కు అనుమతి తప్పనిసరి.  అభ్యర్థులు ఉపయోగించే వాహనాల వివరాలు ముందుగానే కలెక్టర్లు, ఎన్నికల అధికారికి తెలపాలి. ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే కరపత్రాలు, పోస్టర్లు మొదలైన వాటి ముద్రణపై ఆంక్షలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడకుండా అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల ప్రక్రియ ఆగే అవకాశం ఉంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయవద్దు. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయడం.. దొంగ ఓట్లను ప్రోత్సహించడం నేరం. అలాగే అభ్యర్థి డిపాజిట్ తిరిగి పొందాలంటే తనకు పోలైన మొత్తం ఓట్లలో కనీసం 1/6వ వంతు ఓట్లు సాధించాలి. లేదంటే డిపాజిట్ రాదు.

లిస్ట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఫ్రీ సింబల్స్.. 

రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు, రిజిస్టర్డ్‌‌‌‌ పార్టీల జాబితా, వారికి కేటాయించిన గుర్తులతో పాటు ఎలాంటి కేటాయింపులు లేని ‘లిస్ట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఫ్రీ సింబల్స్​’ జాబితాను తెలంగాణ గెజిట్‌‌‌‌లో ఎస్‌‌‌‌ఈసీ ప్రచురిస్తుంది. తమ వద్ద రిజస్టర్‌‌‌‌ అయ్యి ఎలాంటి గుర్తు కేటాయించని పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లకు ‘ఫ్రీ’ గుర్తులను కేటాయించేందుకు ఎస్‌‌‌‌ఈసీ నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేస్తుంది.