హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూల్ టీచర్ల రెండో విడత ఫిన్లాండ్ పర్యటన ఈ నెల26 నుంచి ప్రారంభం కానుంది. టీచర్స్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద మొత్తం 40 మందితో కూడిన టీచర్లు, ఆఫీసర్ల బృందాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బృందం 26 నుంచి అక్టోబర్ 3 వరకు వారం రోజుల పాటు ఫిన్లాండ్‌లో పర్యటించనుంది. అక్కడ అమలవుతున్న బోధనా విధానాలు, విద్యార్థుల సమగ్ర వికాసానికి తోడ్పడే పద్ధతులను క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది.
రాష్ట్రవ్యాప్తంగా 33 మంది టీచర్లను ఎంపిక చేశారు. వీరిలో 12 మంది హెచ్ఎంలు, 10 మంది స్కూల్ అసిస్టెంట్లు, 8 మంది ఎస్జీటీలు, ముగ్గురు మోడల్ స్కూల్ టీచర్లు ఉన్నారు. వీరితో పాటు సమగ్ర శిక్ష జేడీ ఉషారాణి, నల్గొండ డీఈవో సుశీందర్ రావు, బాలానగర్ ఎంఈవో హరిశ్చంద్ర ఉన్నారు.
నేడు సింగపూర్‌కు టీచర్ల టీమ్..
అంతర్జాతీయ విద్యా విధానాలపై క్షేత్రస్థాయి అవగాహన కోసం 40 మంది టీచర్లు, అధికారులతో కూడిన ప్రతినిధి బృందం శనివారం హైదరాబాద్ నుంచి సింగపూర్ పయనం కానుంది. టీచర్స్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్(బ్యాచ్–1) కింద ఈ నెల 12 నుంచి 19 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఎన్ఐఈ– సింగపూర్) భాగస్వామ్యంతో వారం రోజుల పాటు ఈ స్టడీ టూర్ సాగనుంది.
