V6 News

సీక్రెట్ గా 316 డబుల్ ఇండ్ల పంపిణీ..

సీక్రెట్ గా 316  డబుల్ ఇండ్ల పంపిణీ..

పీర్జాదిగూడలో అందజేసిన మేడిపల్లి తహసీల్దార్ 
బీఆర్ఎస్ నేతలకే పంపిణీ చేశారని ఆరోపణలు 


మేడిపల్లి వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకునే డబుల్ బెడ్రూమ్ స్కీమ్​కింద ఇండ్ల పంపిణీ మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతుంది. రెండు రోజులుగా మేడిపల్లి మండల రెవెన్యూ ఆఫీసులో తతంగం నడుస్తుండగా.. బుధవారం తహసీల్దారు మహిపాల్ రెడ్డి లబ్ధిదారులకు పట్టాలు అందజేసిన తీరు చర్చనీయాంశంగా మారింది. మొత్తం 316 ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. 

కానీ మేడిపల్లి మండలం పీర్జాదిగూడలో గుట్టుచప్పుడు కాకుండా టీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు డబుల్ ఇండ్ల పట్టాలు పంచుతున్నారని పీర్జాదిగూడ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆరోపించాడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీర్జాదిగూడలో మంత్రి మల్లారెడ్డి డబుల్ బెడ్రూమ్​ ఇండ్ల పంపిణీకి హాజరుకాకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పంపిణీ లో మంత్రి పాల్గొంటే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు ఇస్తున్నారని ప్రతిపక్షాలు అడ్డుకుంటాయని గుట్టుచప్పుడు కాకుండా పంచి అసలైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని, మంత్రి సూచించిన గులాబీ లీడర్లకే  ఇండ్లను పంచుతున్నారని ఆరోపించారు. 

దీనిపై తహసీల్దార్ ను వివరణ కోరగా.. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతోనే ఇండ్ల పట్టాలు పంపిణీచేస్తున్నామని మేడిపల్లి తహసీల్దార్ మహిపాల్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేసి ఇండ్లను కేటాయిస్తున్నామని, ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని చెప్పారు.