కొత్త ప్రభుత్వానికి  సచివాలయం సిద్ధం..

 కొత్త ప్రభుత్వానికి  సచివాలయం సిద్ధం..

తెలంగాణలో కొత్త ప్రభుత్వానికి సచివాలయం సిద్ధం చేస్తున్నారు.  కొత్త ముఖ్యమంత్రి కోసం సచివాలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. సచివాలంలోని ఛాంబర్ లను జిఎడి శాఖ రెడీ చేస్తోంది.  ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలను సిబ్బంది  ఖాళీ  చేసింది. దీంతో పాత బోర్డులను అధికారులు తొలగించారు.   సచివాలంలో కొలువుదీరనున్న కొత్త మంత్రులకు కొత్త సిబ్బందిని కేటాయించనున్నారు. ఇక, ఆరో ఫ్లోర్ ముఖ్యమంత్రి ఛాంబర్ వద్ద ఉన్న కేసీఆర్ బోర్డ్ తోపాటు స్మితా సబర్వాల్ బోర్డ్ ను కూడా  తొలగించారు. సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో మీడియాకు ప్రత్యేక గది కేటాయించే అవకాశం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రస్తుతం ఉన్న క్యాంటీన్ హాల్ ను మీడియా సెంటర్ గా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణలో  64 స్థానాలను గెలిచిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అయితే,  కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంపై అధిష్ఠానంతో చర్చించేందుకు  కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, నలుగురు పరిశీకులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. మల్లు భట్టీ విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు పేర్లు వినిపిస్తున్నా.. మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం.