- గాంధీభవన్లో సికింద్రాబాద్ డీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ
బేగంబజార్, వెలుగు: కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు దీపక్ జాన్ పిలుపునిచ్చారు. గురువారం గాంధీభవన్లో దీపక్ జాన్ అధ్యక్షతన సికింద్రాబాద్ డీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ, ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు సమగ్ర పౌష్టికాహార పథకం కింద ఉచిత అల్పాహారాన్ని ప్రారంభించినందుకు, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని విస్తరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
మరోవైపు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఒప్పందం దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడుతూ దాన్ని తిరస్కరిస్తున్నట్లు మరో తీర్మానం పాస్ చేశారు. సమావేశంలో ఎంపీలు కడియం కావ్య, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, శ్రీగణేష్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జులతో పాటు జిల్లా కాంగ్రెస్ అనుబంధ విభాగాలు, సెల్స్ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
