పద్మారావునగర్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన 41 ఏండ్ల రవి గోయెంకాకు సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు పునర్జన్మ ప్రసాదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. ప్రమాదంలో తుంటి ఎముక విరగడంతో పాటు బాడీలోని పలు చోట్ల రక్తపు గడ్డలు ఏర్పడినట్లు పరీక్షల్లో డాక్టర్లు గుర్తించారు.
డాక్టర్ ఉదయ్ కృష్ణ మైనేని ఆధ్వర్యంలో 8 గంటల పాటు శస్త్రచికిత్స చేసి తుంటి ఎముకను పునర్నిర్మించగా, కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్ మెకానికల్ విధానంతో ఊపిరితిత్తుల్లోని రక్తపు గడ్డలను తొలగించారు. అనస్థీషియా, క్రిటికల్ కేర్ విభాగాల సమన్వయంతో రవి గోయెంకా పూర్తిగా కోలుకుని శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన వైద్య బృందానికి రోగి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
