ఎయిర్ పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ కొత్త స్టేషన్ : కిషన్ రెడ్డి

ఎయిర్ పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ కొత్త స్టేషన్ : కిషన్ రెడ్డి
  •   ఈ నెలలోనే చర్లపల్లి టర్మినల్ జాతికి అంకితం
  •  కొమురవెల్లి రైల్వే స్టేషన్​కు మోడీ శంకుస్థాపన
  • ట్రిపుల్ ఆర్​ దగ్గర కొత్త రైల్వే స్టేషన్లు
  • కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి

 సికింద్రాబాద్:  రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను, ప్లాట్ ఫామ్ 1లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిర్మాణ పనులను  ఆయన  పరిశీలించారు.  స్టేషన్ ఆధునీకరణ పనులపై రైల్వే జీఎం, ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతేడాది ఈ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారన్నారు. మొత్తం మూడు దశల్లో పనులు జరుగుతాయన్నారు. మొదటి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.

చాలా తక్కువ సమయంలో  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఎయిర్ పోర్ట్ తరహాలో కొత్త స్టేషన్ రూపుదిద్దుకుంటుందన్నారు.  2025 నవంబర్ కల్లా పనులు పూర్తవుతాయన్నారు.  మోదీ చేతుల మీదుగానే రైల్వే స్టేషన్ ను జాతికి అంకింతం చేస్తామని స్పష్టం చేశారు.  నాంపల్లి, కాచిగూడ స్టేషన్ ల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించామన్నారు.  కొమురవెల్లి మల్లన్న దర్శనం కోసం కొత్త న రైల్వే స్టేషన్ నిర్మాణానికి  ఫిబ్రవరిలో మోదీ శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.  అలాగే చర్లపల్లి టెర్మినల్ పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయన్నారు.

ఈ నెలలో చర్లపల్లి టెర్మినల్ ను ప్రధాని అకింతం చేయబోతున్నారని తెలిపారు.  మెట్రో రైల్, ఆర్టీసీ బస్సులకు  రైల్వే స్టేషన్ అనుసంధానంగా ఉంటదన్నారు.  రీజినల్ రింగ్ రోడ్ పూర్తయితే ఆ ప్రాంతాల దగ్గర కొత్త రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ 22 లిఫ్టులు 30 కి పైగా ఎస్కలేటర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రయాణికులు నేరుగా స్టేషన్ లోకి రావడానికి, వెళ్లడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తామన్నారు.