బోనమెత్తిన లష్కర్ : ఇయ్యాల రంగం వేడుక 

V6 Velugu Posted on Jul 26, 2021

  • ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర 
  • బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని  
  • అమ్మవారిని దర్శించుకున్న  సీఎం కుటుంబసభ్యులు 
  • ఇయ్యాల రంగం వేడుక 

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. ఉదయం నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బోనాలు, సాక సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్, పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్​యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, సీఎం కేసీఆర్ భార్య శోభ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. సోమవారం రంగం (భవిష్యవాణి) ఉంటుంది.


సికింద్రాబాద్, వెలుగు: ప్రతిఏటా ఆషాఢమాసంలో నిర్వహించే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఉదయం 4 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ భార్య శోభ, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, కుటుంబసభ్యులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. బోనాలు, సాక సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కరోనా ఆంక్షలు ఉన్నప్పటికీ, జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆలయ పరిసరాల్లో 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని.. 2,500 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. సోమవారం రంగం (భవిష్యవాణి) వేడుక ఉంటుందని చెప్పారు. 
తరలొచ్చిన ప్రముఖులు 
అమ్మవారిని దర్శించుకునేందుకు పలువురు ప్రముఖులు తరలొచ్చారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, హైకోర్టు జడ్జి జస్టిస్ అమర్నాథ్ గౌడ్, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు సాయన్న, ముఠా గోపాల్, దానం నాగేందర్, సురేందర్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భార్య కావ్యరెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 
పాలకులకు బుద్ధి చెప్పాలె: సంజయ్ 
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ హయాంలో పాలన ఫామ్ హౌస్ కే పరిమితమైందని విమర్శించారు. కేసీఆర్ ఎన్నికల టైమ్​లో నెరవేర్చని హామీలిస్తూ.. కులాలు, వర్గాల పేరిట విభజించి పాలిస్తున్నారని ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇలాంటి పాలకులకు బుద్ధి చెప్పాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని వేడుకున్నానని తెలిపారు. 
కేసీఆర్ పాలన నుంచి విముక్తి కల్పించాలె: రేవంత్ 
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని పీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డి దర్శించుకొని మాట్లాడారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సీఎం కేసీఆర్ పాలన నుంచి విముక్తి కల్పించాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో రైతులు నష్టపోయారని, వారికి అండగా నిలవాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. రెండేండ్లలో రాష్ట్ర ప్రజల సమస్యలన్నీ తీరుతాయన్నారు. రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడిచినా ప్రజలకు సామాజిక న్యాయం జరగలేదన్నారు. ప్రజలకు అడుగడుగునా వివక్షే ఎదురవుతోందని.. స్వయం పాలన, స్వేచ్ఛ కోసం కలలుగన్న రాష్ట్ర ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Tagged secunderabad, Rangam, Ujjaini Mahakali Bonalu,

Latest Videos

Subscribe Now

More News