బ్రేక్ వేయబోయి ఎక్సలేటర్ తొక్కిండు...!

బ్రేక్ వేయబోయి ఎక్సలేటర్ తొక్కిండు...!
  • డివైడర్​ను కారు ఢీకొని వృద్ధ దంపతులకు గాయాలు 
  • షుగర్​ లెవెల్స్ ​పెరగడమే కారణం

కంటోన్మెంట్, వెలుగు : సికింద్రాబాద్‌ పరిధిలోని మారేడుపల్లిలో మంగళవారం ఉదయం ఓ వృద్ధ జంట కారు యాక్సిడెంట్లో గాయపడింది. కారు నడపుతున్న భర్త షుగర్​లెవెల్స్​పెరగడంతో తికమకలో బ్రేక్​కు బదులు ఎక్సలేటర్ తొక్కడంతో ఆ వాహనం డివైడర్​ను ఢీకొని ఇద్దరూ గాయపడ్డారు. మహేంద్ర హిల్స్‌కు చెందిన మారుతి, జయలక్ష్మి దంపతులు ఓ ప్రైవేట్ దవాఖానలో వైద్య పరీక్షలు చేయించుకోవడం కోసం సికింద్రాబాద్‌ వైపు బయలుదేరారు. 

మారుతి ఉదయం టిఫిన్​ తీసుకోకుండా కారు నడుపుతుండడంతో కళ్లు తిరిగాయి. మారేడుపల్లి  ప్రభుత్వ పాలిటెక్నిక్​ కాలేజీ వద్దకు రాగానే  బ్రేక్ వేయబోయి పొరపాటున ఎక్సలేటర్​తొక్కాడు. దీంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్పందించిన ట్రాఫిక్ పోలీసులు వారి వాహనాన్ని పక్కకు తొలగించి ఇద్దరినీ దవాఖానకు తరలించారు.