కవిత.. సీఎం కుర్చీపై ఆశపడింది: మంత్రి సీతక్క

కవిత.. సీఎం కుర్చీపై ఆశపడింది: మంత్రి సీతక్క
  •     కేసీఆర్ దిగిపోతే తానే కూర్చుందామనుకున్నది: మంత్రి సీతక్క
  •     మహిళలకు ప్రాధాన్యం ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని కామెంట్
  •     యువతను బీఆర్ఎస్ పట్టించుకోలేదు: పొంగులేటి
  •     ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్తున్నం: కొండా సురేఖ
  •     వరంగల్​లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు

హనుమకొండ/వరంగల్, వెలుగు: సీఎం కావాలని ఎమ్మెల్సీ కవిత ఎంతో ఆశపడిందని మంత్రి సీతక్క అన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి.. కేసీఆర్ దిగిపోతే.. తానే సీఎం కుర్చీలో కూర్చుంటానని కలలు కన్నదని తెలిపారు. కాంగ్రెస్ పవర్​లోకి రావడంతో ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయని చెప్పారు. ‘‘కవితను ప్రజలు ఓడించినా.. ఆరు నెలల్లోనే ఎమ్మెల్సీ పదవి పొందింది. పిల్లలు ఎగ్జామ్స్​లో ఫెయిల్ అయితే సప్లిమెంటరీ పరీక్షల కోసం ఎదురుచూస్తరు. కానీ.. కవిత మాత్రం మేనేజ్​మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్నది’’అని సీతక్క మండిపడ్డారు. 

కాకతీయ యూనివర్సిటీలో కేహబ్, పీవీ నాలెడ్జ్ సెంటర్​ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖతో కలిసి సీతక్క ప్రారంభించారు. వరంగల్​లో దాదాపు రూ.280.85 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీతక్క మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉంది. కానీ.. బీఆర్ఎస్ నేతలు మహిళలను కాంగ్రెస్ సర్కార్ నుంచి దూరం చేయాలని కుట్ర చేస్తున్నరు. నిరుద్యోగ మహిళలకు ఉద్యోగాలు ఇస్తుంటే.. జీవో నంబర్ 3 ద్వారా అన్యాయం చేస్తున్నామంటూ బీఆర్ఎస్ లీడర్లు దొంగ దీక్షలు చేస్తున్నరు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పని చేస్తున్నది. వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేయదు. గత ప్రభుత్వం మహిళలను విస్మరించింది. మేము వారికి ప్రాధాన్యత ఇస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నరు’’అని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలేదన్నారు. కానీ.. ఇప్పుడు ఒకటో తారీఖు రోజే సాలరీ వేస్తుంటే బీఆర్ఎస్ లీడర్లు సహించలేకపోతున్నరని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్యారంటీ అని.. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు.

రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తం: పొంగులేటి

తెలంగాణ కోసం పోరాడిన యువతను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. టీఎస్​పీఎస్సీ పేపర్లు అంగట్లో అమ్ముకుని ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, నిరుద్యోగులకు అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. ‘‘మేము అధికారంలోకి వచ్చాక టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేశాం. గ్రూప్ వన్ నుంచి గ్రూప్ 4 దాకా జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇప్పటికే 31వేల ఉద్యోగాలు ఇచ్చాం. పదేండల్లో గత ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీ కాంపౌండ్ వాల్ కూడా కట్టలేకపోయింది. 652 ఎకరాల కాకతీయ వర్సిటీ భూములు కాపాడేందుకు చర్యలు తీస్కుంటం. ఒకట్రెండు రోజుల్లోనే కాంపౌండ్ వాల్ పనులు ప్రారంభిస్తాం’’అని తెలిపారు. ఏ ఒక్క పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వని కేసీఆర్.. ఫైవ్ స్టార్ హోటళ్లను తలిపించేలా ప్రగతిభవన్​ను కట్టుకున్నారని, 250 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని మండిపడ్డారు. 

ప్రజలే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నరు: కొండా సురేఖ

సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో.. ప్రజలే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని మంత్రి కొండా సురేఖ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్తు న్నామని తెలిపారు. ప్రజలు నమ్మి తమకు అధికారం ఇచ్చారని చెప్పారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 14 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 1,445 మంది కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్ జేఏసీ నాయకులు కోరారు. సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, అర్హులైన వారందరినీ రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.